సరిహద్దుల్లో మన సత్తా పెరుగుతోంది

Update: 2015-09-22 11:10 GMT
ఆయుధ సంపత్తిలో భారత్ మరో మెట్టు పైకెక్కింది. అత్యాధునిక డ్రోన్లు సమకూర్చుకుని పొరుగు దేశాల కవ్వింపులకు సమాధానం చెప్పింది. నిత్యం పాక్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న ఇండియా ఇప్పుడు తన రక్షణ సామగ్రిలో అధునాత డ్రోన్లను చేర్చుకోబోతుంది. ఇజ్రాయెల్ నుంచి హెరాన్ టీపీ డ్రోన్లను దిగుమతి చేసుకుంటుండడంతో భారత రక్షణ - రక్షణ నిఘా వ్యవస్థకు మరింత బలం చేకూరుతోంది.

నేలపైనుంచి 11 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించగలిగే ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ తయారుచేస్తోంది. అంతెత్తున ఉన్నప్పటికీ ఇవి నేలపైన ఉన్న అతి చిన్న గుండుసూదిని కూడా గుర్తించగలవు. అంతేకాదు... గ్రౌండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు స్వీకరించి ఆయుధ ప్రయోగం కూడా చేస్తుంది. దీనికి ఒకసారి ఇంధనం నింపితే చాలు 50 గంటలు ఆగకుండా ప్రయాణించగలదు. అంటే దాదాపు రెండు రోజులు ఇది గాల్లోనే ఉండగలదన్నమాట. మూడేళ్ల కిందటే వీటి కొనుగోలు ప్రతిపాదించినా ఆమోదం పొందేటప్పటికి ఇంత సమయం పట్టింది. మొత్తం 26 వేల కోట్లతో 10 డ్రోన్లు తెప్పిస్తున్నారు.

కాగా భారత్ వద్ద ఇప్పటికే డ్రోన్లు ఉన్నాయి... అయితే అవి నిఘా పెట్టడం వరకు మాత్రమే పరిమితం. ఆయుధాలు ప్రయోగించలేవు. అంతేకాదు... దీనిలా రెండు రోజులపాటు ఆకాశంలో తిరిగే సామర్థ్యం కూడా వాటికి లేదు. దీంతో ఈ అధునాతన డ్రోన్లు ఇండియాకు చేరితే ఎంతో ప్రయోజనం కలగనుంది.
Tags:    

Similar News