మోడీ బ్యాచ్ ముఖం విప్పారేలా తాజా స‌ర్వే రిపోర్ట్‌!

Update: 2018-10-13 04:53 GMT
న‌వంబ‌రు.. డిసెంబ‌రుల‌లో జ‌రిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు మోడీషాల‌కు భారీ షాకిస్తాయా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగినా.. మిజోరం ఫ‌లితం గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌టం లేదు. బుల్లి రాష్ట్ర‌మైన మిజోరంలో ఎవ‌రు గెలిచినా అదేమీ విష‌యం కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌.. మిగిలింది తెలంగాణ రాష్ట్రం.

ఆ స్టేట్‌లో బీజేపీ ప్ర‌భావం నామ‌మాత్రంగా అభివ‌ర్ణిస్తున్న వారు బోలెడుమంది. త‌మ‌ను త‌క్కువ అంచనా వేయొద్దంటూ అమిత్ షా అదే ప‌నిగా చెప్పినా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తెలంగాణ‌లో పోరు మొత్తం అధికార టీఆర్ఎస్‌.. విప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య‌నేన‌ని.. బీజేపీ ఆట‌లో అర‌టిపండుగా అభివ‌ర్ణించే వారు లేక‌పోలేదు.

మిజోరం.. తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి ఎలాంటి ప‌రిస్థితి ఉంద‌న్న దాని కంటే కూడా.. రాజ‌స్థాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నైంది. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ వ్య‌తిరేక గాలి వీస్తుంద‌ని.. అధికార మార్పిడికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

దీనిపై క‌మ‌ల‌నాథులు తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. వారి ఆందోళ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లే బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌ర్వే నివేదిక‌లు సైతం బీజేపీకి వ్య‌తిరేకంగా రావ‌టంపై టెన్ష‌న్ అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ‌.. తాజాగా ఇండియా టీవీ - సీఎన్ ఎక్స్ స‌ర్వే వెలువ‌డింది. ఈ స‌ర్వే ఫ‌లితంలో ఆస‌క్తిక‌ర అంశం ఏమంటే.. మ‌ధ్య‌ప్ర‌దేవ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ వ‌రుస‌గా నాలుగోసారి అధికార‌పీఠాన్ని అందుకోవ‌టం ఖాయ‌మ‌ని.. త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఫ‌లితాల్లో వెలువ‌డే అంతిమ ఫ‌లితం అదేన‌న్న రీతిలో స‌ర్వే ఫ‌లితం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా.. 2013లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ 165 స్థానాల్లో విజ‌యం సాధించి తిరుగులేని అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. వ‌చ్చే నెల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి 128 స్థానాలు రావ‌టం ఖాయ‌మ‌ని  తాజా స‌ర్వే స్ప‌ష్టం చేస్తోంది. ఈసారి ప‌వ‌ర్లోకి ఎట్టి ప‌రిస్థితుల్లో రావాల‌ని త‌ల‌పోస్తున్న కాంగ్రెస్‌కు 85 సీట్లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

బీఎస్పీ ఎనిమిది స్థానాల్లో.. ఇత‌రులు తొమ్మిది స్థానాల్లో గెలుచుకోవ‌టం కాయ‌మంటున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ 42.5 శాతం.. కాంగ్రెస్ 37.19 శాతం ఓట్లు పోల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌ద‌రు స‌ర్వే ప్ర‌క‌టించింది. సీఎం అభ్య‌ర్థిగా శివ‌రాజ్ కు 40.33 శాతం మంది.. కాంగ్రెస్ నాయ‌కులు జ్యోతిరాదిత్య సింధియాకు 22.19 శాతం.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్ నాథ్ కు 18.08 శాతం ఓట‌ర్లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్లుగా స‌ర్వే ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఈసారి కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీర‌టం ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటే.. అందుకు భిన్నంగా ఇండియా టీవీ స‌ర్వే ఫ‌లితాలు వెలువ‌డి కాస్తంత అయోమ‌యానికి.. మ‌రికాస్త గంద‌ర‌గోళానికి గురి చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌జ‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజా సర్వే ఫ‌లితం మోడీషాల ముఖం వెలిగిపోయేలా.. మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డేలా శ‌క్తిని ఇస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News