భార‌త్ స‌త్తా...యూకేకు ఐరాసలో పరాభవం

Update: 2017-11-21 11:17 GMT
భార‌తీయుల‌కు మ‌రో తీపిక‌బురు. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇండియాకు అతిపెద్ద దౌత్య విజయం లభించింది. భారత్ నామినేట్ చేసిన దల్వీర్ భండారీ మరోసారి ఐసీజేకు ఎన్నికయ్యారు. ఎలాగూ ఓటమి తప్పేలా లేదని భావించిన యూకే చివరి నిమిషంలో తమ అభ్యర్థి క్రిస్టొఫర్ గ్రీన్‌ వుడ్‌ ను తప్పించడంతో భండారీ విజయం సాధించారు. అసలు ఓటింగ్‌ ను అడ్డుకుందామనే భావించిన యూకే.. జనరల్ అసెంబ్లీలోగానీ - అటు సెక్యూరిటీ కౌన్సిల్‌ లోగానీ తమకు తగినంత మెజార్టీ లేదని తెలుసుకొని పక్కకు తప్పుకోవడం గమనార్హం.

ఐసీజే న్యాయమూర్తి పదవికి భారత్ అభ్యర్థి దల్వీర్ భండారీ - బ్రిటన్ ప్రతినిధి క్రిస్టోఫర్ గ్రీన్‌ వుడ్ మధ్య ముఖాముఖీ పోటీ ఏర్పడింది. గత 11 రౌండ్ల పోలింగ్‌ లో భండారీ.. ఐరాస సాధారణ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ పొందినా - భద్రతా మండలిలో మూడు ఓట్లు తగ్గాయి. భారత్ మిత్ర దేశాలు రహస్య ఓటింగ్‌ లో అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందని అంచ‌నాలు వ‌చ్చాయి. సోమవారం జరిగిన‌ 12వ రౌండ్ ఎన్నికలో భారత్ నిర్దేశిత మెజారిటీ పొందే అవకాశాలు కనిపించడంతో 1921లో ఆమోదించిన ఉమ్మడి సంప్రదింపుల వ్యవస్థ విధానం ద్వారా రహస్య ఓటింగ్‌ కు బదులు బహిరంగ విధానం అమలు చేయాలని బ్రిటన్ ప్రతిపాదించింది. అయితే...అది వ‌ర్క‌వుట్ అవ‌లేదు. 11 రౌండ్లు పూర్తయిన తర్వాత ఇండియాకు జనరల్ అసెంబ్లీలో - యూకేకు సెక్యూరిటీ కౌన్సిల్‌ లో మెజార్టీ లభించింది. 12వ రౌండ్‌కు ముందు యూకే తమ అభ్యర్థిని తప్పించడంతో ఆ రౌండ్‌లో భండారీకి జనరల్ అసెంబ్లీలోని మొత్తం 193 ఓట్లలో 183, భద్రతా మండలిలోని మొత్తం 15 ఓట్లు వచ్చాయి.

మొదటి నుంచీ సాధారణ సభలో ఇండియాకు బంపర్ మెజార్టీ ఉండగా.. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో 9 యూకేకు మద్దతు తెలిపాయి. 11 రౌండ్లలోనూ ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో సెక్యూరిటీ కౌన్సిల్ సాయంతో అసలు ఓటింగ్ ప్రక్రియనే ఆపేయాలని యూకే చూసింది. అయితే దానికి భద్రతా మండలిలో యూకేకు మద్దతుగా ఉన్న 9 దేశాలు అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో యూకే తప్పుకుంది. 70 ఏళ్ల ఐక్య రాజ్య సమితి చరిత్రలో తొలిసారి యునైటెడ్ కింగ్‌ డమ్‌ కు ఐసీజేలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అంతేకాదు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌ లో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం ఓ సాధారణ దేశం చేతిలో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఒక ఐసీజేలో ఓ సిట్టింగ్ సభ్యుడు మరో సిట్టింగ్ సభ్యుడి చేతిలో ఓడిపోవడం కూడా తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఏ రకంగా చూసినా.. ఇండియా సాధించిన ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకోవాలని నిపుణులు అంటున్నారు.
Tags:    

Similar News