అమెరికాలో వీసా మోసం - ఎన్నారై అరెస్టు

Update: 2019-02-06 06:14 GMT
అమెరికాలో వీసా మోసాలు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భార‌తీయుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి. అమెరికా ఇమ్మిగ్రేష‌న్ అధికారులు వ‌ల ప‌న్ని న‌కిలీ విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటుచేయ‌డంతో.. అందులో చేరేందుకు ప్ర‌య‌త్నించి ఇప్ప‌టికే 129 మంది భార‌తీయ విద్యార్థులు బుక్క‌య్యారు. వారిని విడుద‌ల చేయించేందుకు విదేశాంగ శాఖ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ వ్య‌వ‌హారాన్ని మ‌ర్చిపోక‌ముందే తాజాగా మ‌రో సంచ‌ల‌న ఘ‌ట‌న చోటుచేసుకుంది. వీసా మోసాల ఆరోప‌ణ‌ల‌పై భార‌తీయ అమెరిక‌న్ ఒక‌రు మంగ‌ళ‌వారం అరెస్ట‌య్యారు. 11 న‌కిలీ హెచ్‌-1బీ వీసా ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించ‌డంతోపాటు అమెరికా పౌర‌స‌త్వ ప్ర‌దాన ప్ర‌క్రియ - నాచుర‌లైజేష‌న్ లో ఆయ‌న మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు అభియోగాలు న‌మోద‌య్యాయి.

న్యూజెర్సీలోని పిస్కాట‌వే టౌన్ షిప్ లో ఎన్నారై నీర‌జ్ శ‌ర్మ(43) నివాస‌ముంటున్నారు. సోమ‌ర్ సెట్ కేంద్రంగా ప‌నిచేస్తున్న మాగ్న‌విజ‌న్ ఎల్ ఎల్ సీ అనే సంస్థ‌కు ఆయ‌న య‌జ‌మాని. త‌మ సంస్థ త‌ర‌ఫున స్థానిక నేష‌న‌ల్ బ్యాంకులో శాశ్వ‌త ఉద్యోగాలు ఉన్నాయ‌ని న‌మ్మించి మోస‌పూరితంగా ప‌లువురు విదేశీ ఉద్యోగుల‌ను నీర‌జ్ శ‌ర్మ నియ‌మించుకున్న‌ట్లు ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అభియోగాలు న‌మోదు చేశారు. విదేశీ ఉద్యోగులను ర‌ప్పించేందుకు ఆయ‌న త‌ప్పుడు హెచ్‌-1బీ వీసా ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేశార‌ని ఆరోపించారు.

ఈ కేసులో దోషిగా తేలితే నీర‌జ్ శ‌ర్మ‌కు గ‌రిష్ఠంగా ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశ‌ముంది. దాంతోపాటు 2.5 ల‌క్ష‌ల డాల‌ర్ల జ‌రిమానా కూడా విధించేందుకు వీలుంది. నీర‌జ్ ను నెవార్క్ ఫెడ‌ర‌ల్ కోర్టులో మేజిస్ట్రేట్ జ‌డ్జి మైఖేల్ హామ‌ర్ ఎదుట అధికారులు హాజ‌రుప‌ర్చ‌నున్నారు.


Tags:    

Similar News