పంద్రాగ‌స్టు రోజున ల‌డ‌ఖ్ పై చైనా గురి

Update: 2017-08-16 05:10 GMT
డ్రాగ‌న్ దుర్మార్గాల‌కు అంతూపొంతూ లేన‌ట్లుగా పోతోంది. డోక్లామ్ ఉదంతంలో గుర్రుగా ఉన్న చైనా.. భార‌త్ మీద ఏదోలా షాకిచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మొన్న‌టి వ‌ర‌కూ మాట‌ల యుద్ధానికి తెర తీయ‌టం ద్వారా భార‌త్ మీద అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించేందుకు నానా పాట్లు ప‌డుతున్నా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోవ‌టం తెలిసిందే.

డోక్లామ్ ఉదంతం ఎంత‌కు కొరుకుడుప‌డ‌ని విధంగా మార‌టంతో చైనా మ‌రో దుర్మార్గ‌పు ఎత్తు వేయ‌టం గ‌మ‌నార్హం. డోక్లామ్ పై ఫోక‌స్ పెడుతూనే.. భార‌త్ కు చెందిన ఇత‌ర స‌రిహ‌ద్దుల్లోకి చొచ్చుకురావ‌టం ద్వారా షాక్ ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్లుగా ఉంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తూ కాశ్మీర్ లోని ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లోకి తాజాగా చొచ్చుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది. పంద్రాగ‌స్టు రోజున ఈ దారుణానికి పాల్ప‌డ‌టం ద్వారా.. డ్రాగ‌న్ త‌న దుష్ట‌బుద్ధిని బ‌య‌ట పెట్టుకుంది.

పంద్రాగ‌స్టు హ‌డావుడి యావ‌త్ దేశంలో ఉన్న వేళ.. గుట్టుచ‌ప్పుడు కాకుండా భార‌త్ స‌రిహ‌ద్దుల్లోకి చొచ్చుకురావాల‌న్న విఫ‌ల‌య‌త్నానికి తెర తీసింది. ఉద‌యం ఆరు గంట‌ల వేళ‌లోచైనా సైనికులు ల‌డ‌ఖ్ లోనిఫింగ‌ర్ ఫోర్‌.. ఫింగ‌ర్ ఫైవ్ ప్రాంతంలోకి చొర‌బాటుకు ప్ర‌యత్నించారు. అయితే.. భార‌త సైనికులు అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంతో చైనా సైనికుల దుర్మార్గ ఎత్తుగ‌డ సాగ‌లేదు. త‌మ ప్ర‌య‌త్నాల్ని భార‌త సైన్యం పార‌కుండా చేయ‌టంతో చైనా సైనికులు మాన‌వ‌హారంగా మారి.. భార‌త సైనికుల మీద రాళ్ల దాడికి దిగిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి బ‌దులుగా భార‌త సైనికులు సైతం ధీటుగా బ‌దులిచ్చార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి భార‌త్ అదుపులోనే ఉంద‌ని చెబుతున్నారు. చైనా తాజా ఎత్తులు చూస్తే.. ఏ నిమిషాన ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News