సర్జికల్ దాడి వీడియో రిలీజ్ చేస్తారా?

Update: 2016-10-02 16:27 GMT
సర్జికల్ దాడికి సంబంధించిన మరో సంచలనం చోటు చేసుకోనుందా? అంటే అవుననే చెబుతోంది కేంద్రం. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాల మీద విరుచుకుపడిన భారత్ సైన్యం సర్జికల్ దాడి జరిపి.. ఉగ్రవాద శిబిరాల్ని.. ఉగ్రవాదుల్ని పెద్ద ఎత్తున మట్టుబెట్టి క్షేమంగా భారత్ కు తిరిగి వచ్చేయటం తెలిసిందే. ఈ రహస్య ఆపరేషన్ వివరాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉరీ ఉగ్రదాడికి బదులు తీర్చుకున్న భారత్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. భారత్ చెబుతున్న సర్జికల్ దాడుల్లో నిజం లేదని.. అసలు అలాంటిదేమీ లేదంటూ పాక్ సర్కారు సుద్దులు చెబుతోంది. భారత్ చేస్తున్నదంతా అసత్య ప్రచారంగా పాక్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. సర్జికల్ దాడులు అంటూ ఏమీ జరగలేదని బుకాయించే ప్రయత్నం చేస్తున్న పాక్ తీరుపై భారత్ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యేందుకు సిద్ధమవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సర్జికల్ దాడులు అసలే జరగలేదంటున్న పాక్ కు షాకిచ్చేందుకు.. ఈ దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ప్రశ్నించగా..సూటిగా సమాధానం ఇవ్వని ఆయన.. ‘‘సైన్యం దుమ్ము రేపింది. కాస్త వెయిట్ చేయండి. త్వరలో చూస్తారు’’ అంటూ తన రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే సర్జికల్ దాడుల యవ్వారంలో పరువు పోగొట్టుకున్న పాక్ కు.. ఆ దాడులు జరిగిన తీరుకు సంబంధించిన వీడియో కానీ భారత్ విడుదల చేస్తే.. పాక్ తల దించుకునే పరిస్థితి. మరి.. అలాంటి పరిస్థితి పాక్ తన మాటలతో కొని తెచ్చుకోనుందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సర్జికల్ దాడికి సంబంధించిన వీడియో విడుదలైతే.. పాక్ తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పక తప్పదు. 
Tags:    

Similar News