అమెరికాలో భారతీయుడి ఘరానా మోసం.. ఏకంగా?

Update: 2022-11-24 13:30 GMT
అమెరికాలో ఇటీవల వెలుగు చూస్తున్న స్కాముల్లో పలువురు భారతీయుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. నార్త్ కరోలినాలోని వేక్ కౌంటీలో నివసిస్తున్న అభిషేక్ కృష్ణన్(40) కొద్దిరోజుల కిందటే ఓ బడా స్కాములో ఇరుక్కున్న విషయం తెల్సిందే. కోవిడ్ 19 ఉపశమన పథకం పేరుతో ఏకంగా ఫెడరల్ ప్రభుత్వాన్ని ఎనిమిది మిలియన్ల డాలర్ల మేరకు మోసగించాడని ఎఫ్బీఐ గుర్తించడం కలకలం రేపింది.

ఒక భారతీయుడు అమెరికా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ఏకంగా 8 మిలియన్ల డాలర్ల టోకరా పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసులో కృష్ణన్ తనకు తెలియకుండా మరొక వ్యక్తి పేరును సైతం ఉపయోగించాడు. కృష్ణన్ పై రెండు వైర్ ఫ్రాడ్ రెండు మనీ లాండరింగ్.. రెండు గణనల గుర్తింపు దొంగతనం ఆరోపణలున్నాయి. ఈ కేసులో అతడు అరెస్టయితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఇక ఈ సంఘటన మరవముందే మరో భారతీయుడు అమెరికన్లకు 10 మిలియన్ డాలర్ల టోకరా పెట్టడం సంచలనంగా మారింది. న్యూ అల్బానీకి చెందిన ప్రవాసీ భారతీయుడు రత్నకిషోర్ గిరి(27) క్రిప్టో కరెన్సీ వ్యాపారిగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు. తద్వారా బిట్‌కాయిన్ డెరివేటివ్‌లలోకి భారీగా పెట్టుబడిదారులను ఆకర్షించాడు.

క్రిప్టోకరెన్సీ పోంజీ పథకం పేరుతో రత్న కిషోర్ ఏకంగా పది మిలియన్ల అమెరికన్ డాలర్లను సేకరించాడు. తమ సంస్థలో పెట్టుబడితే ఎలాంటి నష్టాలు లేకుండా లాభదాయకమైన రాబడి ఉంటుందని పెట్టుబడిదారులను నమ్మించాడు. కొత్తగా వచ్చిన పెట్టుబడులను పాత పెట్టుబడి దారులకు తిరిగి చెల్లించానికి ఉపయోగిస్తూ పోంజీ పథకాన్ని ముందుకు నడిపించాడు.

అయితే ప్రధాన పెట్టుబడులను కోల్పోయిన చరిత్ర రత్నకిషోర్ కు ఉంది. ఈ నేపథ్యంలోనే ఫోంజీ పథకంలో పెట్టుబడులు పెట్టిన వారంతా తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరగా రత్న కిషోర్ జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో బాధితులు అతనిపై ఫిర్యాదు చేయడంతో ఫోక్సీ పథకంలో పెట్టుబడిదారులను రత్న కిషోర్ మోసం చేసినట్లు విచారణలో తేలింది.
 
ఇప్పటికే అతడిపై ఐదు వైర్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. వీటిలో అతడి నేరం రుజువైతే ఒక్కో కేసులో గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసును ఎఫ్‌బీఐ కేసు దర్యాప్తు చేస్తుంది. ఏది ఏమైనా ఇటీవలి కాలంలో అమెరికాలో వెలుగు చూస్తున్న బడా స్కాముల్లో భారతీయుల పేర్లు తెరపైకి వస్తుండటం ఒకింత ఆందోళనను రేపుతోంది. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News