ట్రంప్ కు నాలుగేళ్లకు సరిపడా అస్సాం టీ

Update: 2016-07-18 09:57 GMT
 ఇండియాపై తరచూ నోరు పారేసుకుంటున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుద్ధి మారాలంటూ కోల్ కతా కు చెందిన ఓ సంస్థ కొత్త ప్రయత్నం చేసింది. ఆయన శరీరంలోని దుష్టత్వం పోవాలని కోరుకుంటూ గ్రీన్ టీని గిఫ్టుగా పంపించింది. "ప్రియమైన డొనాల్డ్ ట్రంప్...  నమస్తే. మేం మీకు  అత్యంత సహజ సిద్ధమైన గ్రీన్ టీ బ్యాగ్సు పంపుతున్నాం.  ఇది మీ శరీరంలోని దుష్టత్వాన్ని హరిస్తుంది. మనసును స్వచ్ఛంగా చేసుకునేందుకు సహకరిస్తుంది. ఆరోగ్య సమతుల్యాన్ని అందిస్తుంది. ఎంతో మందిని స్మార్ట్ గా చేసింది. దయచేసి ఈ టీ తాగండి. మీ కోసం - అమెరికా కోసం - ప్రపంచం కోసం..." అంటూ కోల్ కతాకు చెందిన  టీఏమీ సంస్థ ఏకంగా 6 వేల అస్సాం గ్రీన్ టీ బ్యాగులను.. దాంతో పాటు ఓ వీడియోను పంపింది.

కాగా కోల్ కతా కంపెనీ పంపించిన అస్సాం టీ న్యూయార్క్ లోని ట్రంప్ టవర్సుకు చేరాయట.. ఈ మేరకు కోల్ కతా కంపెనీ ధ్రువీకరించింది కూడా.  ట్రంప్ వైఖరి వల్ల ప్రపంచమంతా బాధపడుతోందని.. ఆయన్ను మార్చలేం - ఆపలేం కాబట్టి కనీసం బుద్ధి మార్చాలన్న ప్రయత్నంతో ఈ పనిచేసినట్లు కోల్ కతా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.  తాము పంపిన టీ బ్యాగ్ లు కనీసం నాలుగేళ్ల పాటు సరిపోతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ షా వ్యాఖ్యానించారు. తాము పంపిన టీని ఆయన వాడతారనే భావిస్తున్నామని అన్నారు.

అయితే.. టీ ప్యాకెట్లు అందాయని తమకు సమాచారం వచ్చిందని. కానీ.. దీనిపై   ట్రంప్ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న బృందాన్ని కాంటాక్టు చేస్తే మాత్రం వారి నుంచి దీనిపై ఎలాంటి స్పందనా రాలేదని తెలుస్తోంది.  ట్రంప్ నోటి దురుసుతనంపై భారతీయ నేతలెవరూ పెద్దగా రియాక్ట్ కాకపోయినా ఒక టీం కంపెనీ ఇలా ఆయనకు బుద్ధి చెప్పడంపై హర్షం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News