మోడీ ముందే త్రివర్ణ పతాకాన్ని తలకిందలుచేశారే

Update: 2015-11-21 09:21 GMT
దేశ ప్రతిష్ఠకు ప్రతిరూపంగా భావించే జాతీయ పతాకానికి అవమానం జరిగింది. దేశం కాని దేశంలో.. దేశ ప్రధాని చెంతనే దేశ జాతీయ పతాకాన్ని తలకిందలుగా ఉంచటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ప్రధాని నరేంద్రమోడీ తాజాగా మలేషియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసియా దేశాల వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు.

జపాన్ ప్రధాని షింజోను.. ప్రధాని మోడీ కలిశారు. ఇరువురు భేటీ సమయంలో మోడీ పక్కన భారతీయ జెండాను.. జాపాన్ ప్రధాని షింజో పక్కన జపాన్ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే పెద్ద పొరపాటు జరిగింది. మోడీ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తల కిందులుగా ఏర్పాటు చేశారు. దీన్ని పలువురు ఫోటోలు తీశారు. జరిగిన తప్పును తెలుసుకున్న అధికారులు వెనువెంటనే జాతీయ పతాకాన్ని సరి చేశారు.

ఇదంతా భారత్ ను అవమానించేందుకే జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. అలాంటిదేమీ లేదని.. పొరపాటున మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. దీన్ని వివాదం చేయొద్దంటూ అధికారులు వివరణ ఇచ్చారు. అయితే.. దేశ ప్రధాని పాల్గొన్న చోట ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఏర్పాటు చేయటాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News