జీవితకాల కనిష్ఠానికి రూపాయి.. లాభమెంత? నష్టమెంత?

Update: 2022-05-10 04:30 GMT
రూపాయి మారక విలువ చెత్త రికార్డును క్రియేట్ చేసింది. తన జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. ఇందుకు సోమవారం (మే 9) వేదికైంది. యూఎస్ డాలర్ తో పోల్చినప్పుడు రూ.77.44 స్థాయికి పడిపోయి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. మొనగాడు లాంటి మోడీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు.. రూపాయి మారక విలువ ఇంతలా బక్కచిక్కిపోవటం దేనికి నిదర్శనం? బలమైన పాలకుడు ఉన్నప్పుడు.. డెవలప్ మెంట్ లో భారత్ దూసుకెళుతున్నప్పుడు రూపాయి మారక విలువ ఇంత దారుణంగా పడిపోవటం ఎందుకు? దాని కారణంగా చోటుచేసుకునే విపరిణామాలకు కారణం ఎవరు? బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

 అదేం దరిద్రమో కానీ ఈ ఏడాది మొదటి నుంచి రూపాయి మారక విలువ కిందకు చూడటమే కానీ.. పైకి చూసింది లేదు. పైకి చూడాలన్న అత్యాశను పక్కన పెట్టి.. స్టేటస్ కో అయినా మొయింటైన్ అయినా బాగుండేది. కానీ.. అదేమీ కాకుండా అంతకంతకూ పడిపోతున్న విలువ రూపాయిని దెబ్బ తీస్తోంది. ఇప్పుడున్న పరిస్థితి ఇలానే కొనసాగితే.. చాలా తక్కువ వ్యవధిలోనే డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.80కు పడిపోయినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది.

రూపాయి విలువ పడిపోతే జరిగే నష్టాల్ని చూస్తే..

- విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరుగుతాయి

- పెట్రోల్.. డీజిల్ ధరలు మరింతపెరిగి.. ఆ ధరాభారం దేశ ప్రజల మీద పడక తప్పదు

-  కూరగాయలు.. వస్తువులు.. వస్తు సేవల ధరలు పెరుగుతాయి.

- ద్రవ్యోల్బణం కారణంగా రుణాల మీద వడ్డీరేట్లు పెరుగుతాయి.

- సామాన్య.. మధ్యతరగతి వారు కట్టే కిస్తీలు (ఈఎంఐలు) పెరుగుతాయి

- సబ్బులు.. కాస్మోటిక్స్.. సెల్ ఫోన్లు.. ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు పెరుగుతాయి.

- విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు.. బైక్ లతో పాటు కార్ల విడిభాగాల ధరలు పెరుగుతాయి

-  విదేశీ విద్య కోసం బ్యాంకులో రుణాలు తీసుకుంటే.. అది కూడా భారంగా మారుతుంది. ఉదాహరణకు 2017లో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.65 అయితే.. ఇప్పుడు రూ.77.50. దీంతో.. నెలసరి వాయిదాల మీద పడే ప్రభావం ఎంతన్న ది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

-  విదేశీ ప్రయాణాల మీద భారం తప్పదు. ఎందుకంటే..టికెట్ల ధరల్ని డాలర్ రూపంలో చెల్లించినప్పుడు.. తగ్గిన రూపాయి విలువ భారంగా మారుతుంది.
నష్టాలు సరే లాభాలు ఉన్నాయా? అవేంటి?

డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గుతున్న కొద్దీ కలిగే నష్టాలు ఉన్నప్పటికీ.. లాభాలు కొన్ని ఉన్నాయంటున్నారు. అవేమిటన్నది చూస్తే..

-  విదేశాల నుంచి భారత్ కు డబ్బులు పంపే వారి డబ్బుల విలువ ఇక్కడ పెరుగుతుంది. ఉదాహరణకు డాలర్ విలువ రూ.65 ఉన్నప్పుడు విదేశాల నుంచి 100 డాలర్లు పంపితే.. రూ.6500 చేతికి వస్తాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.7750 వరకు వస్తాయి.

- ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ.. ఔషధ మార్కెట్ల మార్జిన్లు పెరిగి.. కంపెనీలు లాభాల బాట పడతాయి. అలాంటి వాటి షేర్లకు లాభాలు పెరిగే వీలుంది.

ఇదంతా చూస్తే.. లాభాల కంటే నష్టాలే ఎక్కువన్న విషయం అర్థమవుతుంది. రూపాయి విలువ పెరగొద్దు..తగ్గొద్దు.. స్టేటస్ కో లో ఉంటే అందరికి ఎలాంటి సమస్యా ఉండదు. కానీ.. మోడీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళల్లో రూపాయి విలువ ఎందుకని అంతలా పడిపోయిందన్న దానికి సమాధానం చెప్పేవాళ్లు ఎవరన్నది అసలు ప్రశ్న. అంతా బాగున్నప్పుడు రూపాయి విలువ అంతకంతకూ ఎందుకు పడిపోతున్నట్లు?
Tags:    

Similar News