అమెరికా కాలేజీకి షాకిచ్చిన చిత్తూరు జిల్లా కుర్రాడి తెలివి

Update: 2019-08-15 06:37 GMT
ఏ దేశంలో అయితే తెలుగోడికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో.. అదే దేశంలో ఒకతెలుగు కుర్రాడికి అక్కడి కోర్టు జైలుశిక్షతో పాటు.. భారీ జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇంతకీ.. ఆ తెలుగు కుర్రాడు ఎవరు?  ఎక్కడి వాడు?  ఏం చేస్తుంటాడు?  చేసిన నేరం ఏమిటి?  దాని కారణంగా చోటు చేసుకున్న విపరిణామాలు ఏమిటన్న విషయాల్లోకి వెళితే..

ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన 27 ఏళ్ల ఆకుతోట విశ్వనాథ్ అమెరికాలో చదువుకున్నాడు. తాజాగా అతడు తాను చదువుకున్న కాలేజీలోకి అనుమతి లేకుండా ప్రవేశించాడు. వచ్చాడా?  సరదాగా తెలిసిన వారిని పలుకరించి వెళ్లిపోతే బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా కాలేజీలోని 60 కంప్యూటర్లలోకి తాను రూపొందించిన బగ్ ను ప్రవేశ పెట్టాడు.

ఇంతకీ ఆ బగ్ ఏమంటే.. దీన్ని కంప్యూటర్ లోకి ప్రవేశ పెట్టిన వెంటనే ఆన్ బోర్డ్ కెపాసిటర్లు వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. అదే సమయంలో పదే పదే డిశ్చార్జ్ అయ్యేలా అలర్ట్ పంపుతుంది. దీంతో యూఎస్బీ పోర్టు.. ఎలక్ట్రికల్ సిస్టం ఓవర్ లోడ్ కావటంతో కంప్యూటర్ పాడవుతుంది. తాను రూపొందించిన బగ్ ను కంప్యూటర్లలో ప్రవేశ పెట్టిన విశ్వనాథ్.. సక్సెస్ అయ్యే వేళ.. నేను దీన్నిచంపేస్తున్నానంటూ పెద్దగా అరవటంతో పాటు.. కంప్యూటర్లు పాడైన వెంటనే.. దీని పని అయిపోయిందంటూ కేకలు పెట్టాడు.

దీంతో అలెర్ట్ అయిన కాలేజీ సిబ్బంది ఇతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే 60కి పైగా కంప్యూటర్లు బగ్ కారణంగా చెడిపోయాయి. ఈ దృశ్యాల్ని తన ఐ ఫోన్ లో షూట్ చేసుకున్నాడు. అతన్ని పోలీసులకు అప్పజెప్పగా.. విచారించిన కోర్టు ఏడాది జైలుతోపాటు.. రూ.41.71 లక్షల భారీ జరిమానాను విధిస్తూ తీర్పును ఇచ్చారు. తెలివిని విధ్వంసానికి వినియోగిస్తే ఏమవుతుందో తాజా ఉదంతాన్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.


Tags:    

Similar News