కాల్పుల్లో భార‌త విద్యార్థికి గాయాలు

Update: 2022-03-04 09:30 GMT
ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధంలో ఓ భార‌త విద్యార్థి కాల్పుల్లో గాయ‌ప‌డ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇరు దేశాల సైనికుల మ‌ధ్య‌లో కాల్పుల్లో భాగంగా ఆ భార‌త విద్యార్థికి బుల్లెట్ గాయ‌మైన‌ట్లు ఆయ‌న్ని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిసింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ను వీడుతున్న నేప‌థ్యంలో ఆ విద్యార్థి కాల్పుల్లో గాయ‌ప‌డ్డ‌ట్లు భార‌త కేంద్ర విమాన‌యాన శాఖ స‌హాయ మంత్రి వీకే సింగ్ శుక్ర‌వారం వెల్ల‌డించారు. కీవ్ నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో ఆ విద్యార్థి కాల్పుల్లో గాయ‌ప‌డ్డార‌ని, ఆయ‌న్ని వెంట‌నే న‌గ‌రంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వీకే సింగ్ పేర్కొన్నారు. అయితే ఆ విద్యార్థి పూర్తి స‌మాచారం ఇంకా తెలియ‌లేదు.

"కీవ్‌ను వీడే నేప‌థ్యంలో భార‌త విద్యార్థి ఒక‌రు కాల్పుల్లో గాయ‌ప‌డ్డార‌ని మాకు స‌మాచారం వ‌చ్చింది. ఆ విద్యార్థిని తిరిగి న‌గ‌రంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సైనికుల మ‌ధ్య పోరాటంలో భాగంగా ఇది జ‌రిగింది. త‌క్కువ న‌ష్టంతో వీలైనంత మంది ఎక్కువ భార‌త విద్యార్థుల‌ను స్వ‌దేశం త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం" అని వీకే సింగ్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ర‌ష్యా దాడిలో ఉక్రెయిన్‌లోని ఖ‌ర్కిల్‌లో క‌ర్ణాట‌క విద్యార్థి  న‌వీన్ శేఖ‌ర‌ప్ప ప్రాణాలు కోల్పోవ‌డం షాక్‌కు గురి చేసిన సంగ‌తి తెలిసిందే.

ఉక్రెయిన్‌లోని ఉద్రిక్త‌ల‌పై అక్క‌డి భార‌త రాయ‌బార కార్యాల‌యం ఎప్ప‌టికప్పుడూ హెచ్చరిక‌లు జారీ చేస్తూనే ఉంది. అక్క‌డి నుంచి భార‌త విద్యార్థుల‌ను తిరిగి స్వ‌దేశం ర‌ప్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. న‌లుగురు కేంద్ర మంత్రులు అందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు విద్యార్థుల‌ను ర‌ప్పించి అక్క‌డి నుంచి విమానాల్లో దేశానికి పంపిస్తున్నారు. వీకే సింగ్ పోలండ్‌లో, హ‌ర్దీప్ సింగ్ హంగేరీలో, జ్యోతిరాదిత్య సిందియా రొమేనియాలో, కిరెన్ రిజిజు స్లోవేకియాలో ఉండి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
Tags:    

Similar News