చేతుల‌కు సంకెళ్లు..కాళ్ల‌కు జీపీఎస్ ట్యాగ్‌ లతో మ‌న విద్యార్థులు

Update: 2019-02-02 09:55 GMT
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ ను తలపించేలా స్వయానా అమెరికా ఇమ్మిగ్రేషన్ - కస్టమ్స్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ (ఐసీఈ) స్కెచ్‌ తో అక్రమ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను భారీగా అదుపులోకి తీసుకున్న  అమెరికా అధికారులు... వారిని వెనకకు పంపే ప్రక్రియ (డిపోర్టేషన్)ను చేపట్టారు. అయితే, ఈ ఎపిసోడ్ ప‌లు క‌ల‌క‌లం రేపే అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తొలుత వారిని ప్రశ్నించి వదిలివేస్తూ - కోర్టు నోటీసులు జారీచేశారు. ఈ ఘటనలో బాధితులు ఎక్కువమంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోంది. దేశం కాని దేశంలో ఉన్నట్టుండి వచ్చి పడిన ఆపదతో తెలుగు రాష్ర్టాల విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. కోర్టు నోటీసులకు జవాబులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటివారికి న్యాయపరమైన సహాయం అందించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు ముందుకొచ్చాయి.

అరెస్టయిన విదేశీ విద్యార్థుల్లో తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరందరిపై పౌర వలస నిబంధనల చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేయనున్నట్లు ఇమ్మిగ్రేషన్ - కస్టమ్స్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ (ఐసీఈ) అధికార ప్రతినిధి కరిస్సా కట్రెల్ చెప్పారు. కొద్దిరోజుల్లో మరికొంతమంది విద్యార్థులను అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. వీసా నిబంధనలు ఉల్లంఘించి అమెరికాలోనే ఉండేందుకు ఈ విద్యార్థులంతా డెట్రాయిట్‌ లోని ఫార్మింగ్‌ టన్ యూనివర్సిటీలో చేరారు. వీరిలో అత్యధికులు చదువుకునే ఉద్దేశంతో చేరినవారు కాదు. కనీసం క్లాసులకు హాజరైన రికార్డు కూడా వీరికి లేదు. ఈ కుట్రలో భాగస్వాములైన వారందరికీ ఈ వర్సిటీలో అధ్యాపకులు లేరని - తరగతులు జరుగవని ముందే తెలుసు అని పేర్కొన్నారు.

కాగా, వీసా గడువు ముగిసినా సుమారు 600 మంది విదేశీ విద్యార్థులు అమెరికాలోనే ఉండేందుకు సహకరించిన ఎనిమిది మంది తెలుగు విద్యార్థులను మిషిగాన్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురిని డెట్రాయిట్‌ లో - ఇద్దరిని వర్జీనియా - ఫ్లోరిడాలో అరెస్టుచేశారు. వీరిపై వీసా అక్రమాలకు పాల్పడడం - తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ - లాభాపేక్ష కోసం విదేశీయులకు అక్రమంగా ఆశ్రయం కల్పించడం వంటి అభియోగాలు మోపారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా - లాభాపేక్షతోనే విదేశీ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుచేసి వారికి అక్రమంగా ఆశ్రయం కల్పించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.14.25 లక్షల వరకు వసూలు చేశారు అని సంబంధిత పత్రాల్లో పేర్కొన్నారు. అభియోగాలు రుజువైతే నిందితులకు గరిష్ఠంగా ఐదేండ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంది.

మరోవైపు డెట్రాయిట్‌ లో అరెస్టయిన ఆరుగురు తెలుగు విద్యార్థులను సంకెళ్లతో గురువారం స్థానిక కోర్టుకు తీసుకువచ్చారు. అయితే, వీరికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించి - కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, తాజాగా అరెస్టయిన విద్యార్థుల్లో పలువురికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారు 60 మైళ్ల పరిధిని దాటిపోకుండా వారికి జీపీఎస్ ట్యాగ్ తగిలించారు. అరెస్టు కానివారు ఫిబ్రవరి 5లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. కాగా, ఇమ్మిగ్రేషన్ జడ్జిల డేట్స్ దొరకకపోవడంతో ఈ కేసు మరో రెండు వారాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags:    

Similar News