ఎన్నారైల‌కు తామున్నామంటున్న చిన్న‌మ్మ‌

Update: 2017-03-24 05:52 GMT
అమెరికాలోని భార‌తీయ ఎన్నారైల‌కు అండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం ఉంద‌ని ఈ విష‌యంలో బెంగ అక్క‌ర్లేద‌ని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ భ‌రోసా ఇచ్చారు. ఇటు ప‌రిపాల‌న ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటుగా దౌత్య విధానాల ద్వారా కూడా అమెరికాలోని భార‌తీయుల‌కు అండ‌గా ఉంటున్న‌ట్లు ఆమె వివ‌రించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు హెచ్-1బి వీసాలకు సంబంధించి వ్యక్తం చేసిన అనుమానాలమై మంత్రి వివరణ ఇచ్చారు. భారత్‌నుంచి అక్రమంగా వలసవచ్చిన వారిగా పేర్కొంటూ అమెరికా అధికారులు 271 మందితో ఒక జాబితాను ఇచ్చారని, అయితే ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదని, అన్ని అంశాలు నిర్ధారించుకున్న తర్వాతనే వారిని భారత్‌కు పంపించడానికి అనుమతిస్తామని సుష్మా చెప్పారు. ‘మేము ఈ జాబితాను అంగీకరించలేదు. మరిన్ని వివరాలు కోరాం. వివరాలన్నీ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వారిని భారత్‌ కు తిప్పి పంపడానికి ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని అమెరికాకు చెప్పాం’ అని ఆమె అన్నారు. ఒక‌వేళ భార‌త్  స్పందించ‌ని పక్షంలో వారిని అరెస్టు చేస్తారని, అయితే అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కానివ్వ‌బోమ‌న్నారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా విధానాల్లో మార్పు వచ్చిందని చెప్పడం సరికాదని సుష్మ చెప్పారు. ఐటీ నిపుణులతోసహా అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ట్రంప్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల ప్రభావంపట్ల పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ నిపుణులకోసం జారీచేసే హెచ్-1బీ, ఎల్-1 వీసాల గురించి మాట్లాడుతూ, వీటికి సంబంధించి నాలుగు బిల్లులు అమెరికా కాంగ్రెస్‌ కు వచ్చాయని, అయితే వీటిలో ఏది కూడా ఆమోదం పొందలేదని సుష్మా స్వరాజ్ చెప్పారు. భారతీయులు లేదా ఐటీ నిపుణుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడడానికి తమ ప్రభుత్వం అమెరికాతో అత్యున్నతస్థాయిలో చర్చలు జరుపుతోందని ఆమె చెప్పారు. ఐటీ నిపుణులు అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలించడం లేదని, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతున్నారని కూడా ప్రభుత్వం వారికి అర్థమయ్యేలా చెప్తోందని అన్నారు.

అమెరికాకు చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ దేశం సంక్షేమం కోణంలో కొన్ని బిల్లులను ప్రతిపాదించార‌ని సుష్మాస్వ‌రాజ్ చెప్పారు. అయితే ఈ బిల్లులు అదే రూపంలో ఆమోదం పొందకుండా చూడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని, గ‌తంలో కూడా తాను ఇదే విష‌యాన్ని చెప్పాన‌ని ప్ర‌స్తావించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి అమెరికా కాంగ్రెస్ సభ్యులను కలిశారని, వాళ్లంతా కూడా భారతీయులను ప్రశంసించారని సుష్మా స్వరాజ్ చెప్పారు.డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు కూడా హెచ్-1బి వీసాలకు సంబందించి సమస్యలు వచ్చాయని సుష్మ చెప్పారు. తొలుత హెచ్-1బి వీసాలను ప్రవేశపెట్టినప్పుడు 65వేల వీసాలు మాత్రమే ఇచ్చారని, ఆ తర్వాత ఆ సంఖ్య ను లక్షా 95 వేలకు పెంచారని, మళ్లీ అది 65 వేలకు తగ్గిపోయిందని ఆమె వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News