రిచ్‌ నెస్ చూపించ‌డం ఎందుకంటున్న టాటా!

Update: 2017-03-03 04:14 GMT
అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని ఓలాతేకు చెందిన ఓ బార్‌ లో జ‌రిగిన దాడిలో తెలుగు నేల‌కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. అంత‌కు వారం ముందు ఆ దేశంలో జ‌రిగిన మ‌రో దాడిలో తెలంగాణ‌కు చెందిన మ‌రో యువ‌కుడు కూడా చ‌నిపోయాడు. ఒలాతే ఘ‌ట‌న కంటే ముందు జ‌రిగిన ఘ‌ట‌న అక్క‌డి ప్ర‌వాసుల‌ను అంత‌గా భ‌య‌పెట్ట‌లేదు గానీ... కూచిభొట్ల ఉదంతంతో మాత్రం అక్క‌డి తెలుగు వారితో పాటు ఎన్నారైలు - ఇత‌ర దేశాల‌కు చెందిన వారంతా తీవ్ర భ‌యాందోళ‌న‌లకు గుర‌య్యారు. జాత్య‌హంకారంతోనే జ‌రిగిన ఈ దాడిలో కూచిభొట్ల అక్క‌డికక్క‌డే కుప్ప‌కూలిన వైనం అమెరిక‌న్ల‌ను కూడా క‌ల‌చివేసింద‌నే చెప్పాలి. అయినా జాతి వివ‌క్ష‌తో అక్క‌డ జ‌రుగుతున్న దాడులు ఎక్కువ‌గా ప్ర‌వాస భార‌తీయుల మీదే జ‌రుగుతున్నాయ‌న్న వాద‌న లేక‌పోలేదు.

అయినా అమెరికా జాత్య‌హంకారుల‌కు ప్ర‌వాస భార‌తీయులే ఎందుకు టార్గెట్‌ గా మారుతున్నార‌న్న విష‌యంపై అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల సంఘాల‌తో పాటు ఎన్నారై ఆర్గ‌నైజేష‌న్లు దృష్టి సారించాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ‌కు చెందిన ప్ర‌వాసుల‌కు చెందిన తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేష‌న్ (టాటా) దాడుల‌కు దారి తీస్తున్న కొన్ని అంశాల‌ను వెలికి తీసింది. తెలుగు వారికే కాకుండా భార‌తీయుల‌కు ఆడంబ‌రాలంటే మిగిలిన దేశాల ప్ర‌జ‌ల కంటే కాస్తంత ఎక్కువే. వృత్తి నైపుణ్యంలో ఇత‌ర దేశాల‌కు చెందిన వారి కంటే కూడా  భార‌తీయులు మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నారైల‌కు మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ల‌భిస్తున్నాయి. అంతేకాకుండా... మంచి వేత‌నాల‌తో పాటు హై పొజిష‌న్స్ కూడా ద‌క్కుతున్నాయి.

ఈ క్ర‌మంలో తాము ప‌నిచేస్తున్న కంపెనీ ప్ర‌తిష్ఠ‌ను కాస్తంత గ‌ర్వంగా చాటుకుంటున్న మ‌నోళ్లు... ఆయా కంపెనీల్లో ఏఏ స్థాయిలో ప‌నిచేస్తున్న‌ది?... ఎంత‌మేర ప్యాకేజీ ల‌భిస్తున్న‌ద‌న్న అంశాల‌ను బ‌హిరంగంగానే గొప్ప‌గా చెప్పుకుంటున్నార‌ట‌. అంతేకాకుండా మంచి వేత‌నం తీసుకుంటున్న ఎన్నారైలు ఖ‌ర్చులోనే ఏమాత్రం వెనుకాడ‌టం  లేద‌ట‌.  పెద్ద‌గా, రాజ‌సం ఉట్టి ప‌డేలా ఉండే రేంజ్ రోవ‌ర్ కార్ల‌ను కొనుగోలు చేసి, వీకెండ్స్‌ లో ఫ్రెండ్స్ తో క‌లిసి షికార్లు చేస్తున్నార‌ట‌. సంపాదిస్తున్న సొమ్ముతో ఎంజాయ్ చేయ‌డంలో పెద్ద త‌ప్పు లేదు గానీ... ఇదే అంశం అక్క‌డి జాత్య‌హంకారుల దృష్టిని ఆక‌ర్షిస్తుందన్న‌ది టాటా భావ‌న‌. అప్ప‌టికే క‌నీస నైపుణ్యాలు లేకుండా అవ‌కాశాలు ద‌క్క‌క తీవ్ర నిరాశ‌లో ఉంటున్న జాత్య‌హంకారులు... ఇలా ల‌గ్జ‌రీ కార్ల‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ క‌నిపించే ఎన్నారైలను టార్గెట్ చేస్తున్నార‌ని ఆ సంస్థ అభిప్రాయ‌ప‌డుతోంది.

కూచిభొట్ల ఉదంతంతోనైనా కాస్త ఆడంబ‌రాలు తగ్గించాల‌ని ఆ సంస్థ అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది. ఇక మ‌నోళ్లంతా మ‌న నేల‌కు చెందిన వారితోనే క‌ల‌లిసి మెలిసి తిరుగుతున్నారు త‌ప్పించి... తాము ప‌నిచేసే చోట ఉద్యోగాలు చేస్తున్న అమెరిక‌న్ల‌తో అంత‌గా క‌లిసిపోవ‌డం లేద‌ట‌. అక్క‌డి వెళ్లిన మ‌నం అక్క‌డి వారితో మ‌మేక‌మైతేనే కదా... మ‌న ఆచార వ్య‌వహారాలు, మ‌న లైఫ్ స్టైల్ వారికి అర్థ‌మ‌య్యేది అన్న దిశ‌గానూ ఆ సంస్థ‌త  ప‌ప‌లు స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తోంది. ఇప్ప‌టికైనా.... మ‌న నేల‌కు చెందిన వారితో పాటు అక్క‌డి వారితోనే  స్నేహంగా మెలిగితే... ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌త్సంబంధాలు బ‌ల‌ప‌డ‌తాయ‌ని, ఫ‌లితంగా జాత్య‌హంకార దాడుల‌కు అంత‌గా ఆస్కారం ఉండ‌ద‌ని ఆ సంస్థ చెబుతోంది. అంతిమంగా ఆ సంస్థ చెప్పొచ్చేదేమంటే... రోగం ముదిరాక చికిత్స తీసుకునే కంటే... నివార‌ణ మార్గాల‌పై దృష్టి పెట్టడ‌మేన‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News