భారత దేశంలోని సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. ఇక్కడి ఆచార వ్యవహారాలను విదేశీయులు కూడా గౌరవించిన సందర్భాలు అనేకం. అటువంటి భారతదేశంలో గతంలో శృంగార సంబంధ విషయాల గురించి మాట్లాడడం - చర్చించడం చాలా అరుదుగా జరిగేది. అయితే, మారుతున్న కాలాన్ని బట్టి ప్రజల్లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం సెక్స్ - పిరియడ్స్ - సుఖ వ్యాధుల గురించి ప్రజలు కొద్దోగొప్పో చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా - సురక్షితం కాని పద్ధతుల్లో - కండోమ్ లేకుండా శృంగారం జరపడం వల్ల ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని స్వయంగా ప్రభుత్వం ప్రచారం కల్పించడంతో ప్రజల్లో ఆ వ్యాధి గురించి - కండోమ్ ల గురించి కొంత అవగాహన వచ్చింది. అయితే, ఇప్పటికీ భారత్ లో కండోమ్ వినియోగించే వారి శాతం చాలా తక్కువగా ఉంది. భారత్ లో కేవలం 5 శాతం మంది మాత్రమే కండోమ్ లను ఉపయోగిస్తున్నారని, ఇది తమను విస్మయానికి గురి చేస్తోందని ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ `డ్యూరెక్స్ ` ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు, భారత్ లో చాలామంది కండోమ్ ఎందుకు వాడరో తెలుసుకోవడానికి ట్విట్టర్ లో ఏకంగా ఓ ఒపీనియన్ పోల్ ను చేపట్టింది.
``భారత్ లో ఏం జరుగుతోంది? 95 శాతం మంది భారతీయులు కండోమ్ లు ఎందుకు వాడడం లేదో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం``అంటూ ట్వీట్ చేసింది. దాంతో పాటు `` వై డజ్ ఇండియా హేట్ కండోమ్స్ ...వి వాంట్ టు నో`` అంటూ ఒపీనియన్ పోల్ ను స్టార్ట్ చేసింది. అయితే, ఈ ప్రకటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మెడికల్ షాపులకు వెళ్లి కండోమ్ లు కావాలని అడగడానికి సిగ్గు పడుతున్నామని కొందరు కామెంట్స్ చేశారు. చాలా మంది భారతీయులు....కండోమ్ లేకుండానే సెక్స్ చేయడానికి ఇష్టపడతారని కొందరు కామెంట్ చేశారు. పతంజలి కండోమ్ కోసం వేచి చూస్తున్నామని మరికొందరు.....అక్షయ్ కుమార్ ....కండోమ్ మ్యాన్ అనే సినిమా తీశాక వాడదామని వెయిట్ చేస్తున్నామని మరికొందరు....చమత్కార ధోరణిలో కామెంట్స్ చేశారు. కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే `డ్యూరెక్స్ ` సంస్థ ఇటువంటి చీప్ పబ్లిసిటీకి పాల్పడుతోందని మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైనా ....ఈ పోల్ తో ఆ సంస్థ ఓ సరికొత్త చర్చకు తెర తీసిందని చెప్పవచ్చు.