తనకు తాను దేవుడిగా ప్రకటించుకొని వేలాది మంది భక్తులను కలిగి ఉన్న ఆశారామ్ బాపు...16 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసినకేసులో జోధ్ పూర్ కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. లైంగికదాడి - హత్య - ఇతర క్రిమినల్ కేసుల్లో ఇలాంటి బాబాలు - స్వామిజీల పేర్లు ఉండటం ఇదే మొదటిసారి కాదు.గతంలోనూ ఎందరో ఇలాంటి ఘనకార్యాలు చేశారని చెప్తున్నారు. అలాంటి వారిలో కొందరు
గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్
డేరా సచ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ రెండు లైంగికదాడి కేసుల్లో 2017 ఆగష్టు 25న దోషిగా నిర్థారించబడ్డారు. బాధితురాల్లో ఒకరు 2002లో అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌కి గుర్మీత్ సింగ్ అఘత్యాల గురించి లేఖ రాసారు. అతనిపై చర్య తీసుకోవాలని కోరారు. అతనికి గత ఏడాదిలో శిక్ష పడింది. గుర్మిత్ శిక్ష ఖరారు కావడంతో అతని అనుచరులు హర్యానాలో ముఖ్యంగా పంచ్‌కుల, సిర్సాలో భారీ ఎత్తున అల్లర్లుకు పాల్పడ్డారు. ఈ హింసాకాండ దేశ రాజధానికి కూడా తాకింది. గుర్మిత్‌పై హత్యా నేరం ఆరోపణలు కూడా ఉన్నాయి. తన మద్దతుదాలు ఇద్దరిని హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
నారాయణ్ సాయి
ఆశారామ్ బాపు కుమారుడు నారాయణ్ సాయి ప్రస్తుతం ఒక రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2005 నుంచి 2005 మధ్య కాలంలో ఒక ఆశారాం ఆశ్రమంలో ఒక మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మరో ఎనిమిది మంది బాలికలపై కూడా నారాయణ్ లైంగికదాడికి పాల్పడినట్టు కేసు ఉంది. వీరిలో అతని భక్తులు కూడా ఉన్నారు. 2016 నవంబర్‌లో ఒక మహిళ జర్నలిస్టు కూడా సాయిపై ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోకి అతని ఆశ్రమానికి ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె ఆరోపించింది.
స్వామి నిత్యానంద
ఒక తమిళనటితో శృంగారంలో స్వామి నిత్యానంద పాల్గొంటూ ఉన్న వీడియోలు సంచనలం సృష్టించాయి. 2010 మార్చిలో ఈ వీడియోలు టీవీల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే నిత్యానంద ఈ వీడియోలను ఖండించారు. ఆమె తన భక్తురాలు మాత్రమేనని తెలిపారు. అలాగే తన మాజీ అనుచరాలపై లైంగికదాడికి పాల్పడిన కేసు కూడా ఈ స్వామీజిపై ఉంది. ఇతని ఆశ్రమంలో డ్రగ్స్ - కండోమ్స్ - ఇతర నిషిద్ధ వస్తువులను పోలీసులు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలాన్ జిల్లాలో 2010 ఏప్రిల్ 21న పోలీసులు అరెస్టు చేశారు. రెండు సంవత్సరాల తరువాత నిత్యానంద తనపై 5 సంవత్సరాల నుంచి లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఒక అమెరికన్ మహిళల ఆరోపించండంతో స్వామి మరోసారి వార్తల్లోకి వచ్చారు.
సంత్ స్వామి భీమానంద్
శివ్ మురత్ ద్వివేది అలియాస్ ఇచ్చధారి సంత్ స్వామి భీమానంద్ జీ మహారాజ్‌పై సెక్స్ రాకెట్ నడపుతున్నాడనే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వ్యభిచారం కోసం అతను ఒక వెబ్‌సైట్‌నే నిర్వహిస్తున్నాడని అభియోగాలు ఉన్నాయి. దేశ రాజధానిలో సుమారు దశాబ్ధం పాటు సెక్స్ రాకెట్ నిర్వహించాడని కేసు నమోదయింది. మద్యం మత్తులో స్వామి నాగిని నృత్యం చేస్తున్న వీడియో సంచలనం సృష్టించింది.
స్వామి ప్రేమానంద
ప్రేమ్‌కుమార్ అలియాస్ రవి అలియాస్ స్వామి ప్రేమానందపై లైంగికదాడి, హత్య కేసులు ఉన్నాయి. తమిళనాడులోని తిరుచిపల్లీ వద్ద ఇతని ఆశ్రమం ఉంది. 1994లో ఆశ్రమ ప్రాంగణంలోనే రవి అనే ఇంజనీర్‌ను హత్య చేసినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే 15 మందిపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజవయింది. 2005లో ఇతనికి సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. 2011 ఫిబ్రవరిలో అనారోగ్యంతో ఇతను మృతిచెందారు.
స్వామి అమృత్ చైతన్య
మైనర్ బాలికలను లైంగికదాడి చేసిన కేసులో సంతోష్ మాధవన్ అలియాస్ స్వామి అమృత్ చైతన్యను 2008లో అరెస్టు చేశారు. ఒక ఎన్ఆర్ఐ మహిళను మోసం చేశాడనే ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. కేరళ కోర్టు ఇతన్ని దోషిగా తేల్చింది.