టీవీ చర్చల్లోనూ ఇరగదీయటమేనట.. గులాబీ నేతలకు ఇండికేషన్

Update: 2021-03-02 15:30 GMT
అధికారానికి ముందు ఒకలా.. వచ్చాక మరోలా వ్యవహరించటం చాలాపార్టీలు చేసేదే. సుదీర్ఘ కాలం ఉద్యమాన్ని నిర్వహించి.. తాము అనుకున్న తెలంగాణను పోరాడి సాధించటంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాల్ని తక్కువ చేయలేం. ఆ సందర్భంలో పార్టీని ప్రజల్లోకి వెళ్లేలా చేయటంలో పలువురు నేతలు ఎంతగానో కష్టపడ్డారు. టీవీ చర్చల్లో బలమైన వాదనను వినిపించటం.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించేలా చెప్పిన మాటలు తెలంగాణ విషయంపై అందరిని సానుభూతి లభించేలా చేసింది.

పార్టీకి బలంగా మారిన నేతల మాటల విషయంలో పార్టీ పెట్టిన సెన్సారింగ్ పుణ్యమా అని.. కొన్నేళ్లుగా టీవీ చర్చలకు గులాబీ నేతలు దూరంగా ఉంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ షోలలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నప్పటికి కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్ని పార్టీ లైన్ కు తగ్గట్లుగా మాట్లాడలేక తెల్లముఖం వేయటం.. గులాబీ బాస్ కు అస్సలు నచ్చలేదు.

విషయాల మీద అవగాహన లేకుండా టీవీ చర్చల్లోకి వెళ్లి పార్టీని బద్నాం చేస్తున్నారన్న పేరుతో.. టీవీ చర్చలకు టీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. చాలామంది చర్చలకు దూరమయ్యారు. పార్టీ ఎంపిక చేసిన వారు తప్పించి.. మరెవరూ టీవీ చర్చల్లోకి వెళ్లొద్దని స్పష్టం చేశారు. దీంతో.. ఎవరికి వారు వెనక్కి తగ్గిన పరిస్థితి. దీంతో గులాబీ పార్టీకి సంబంధించి వాయిస్ చెప్పే వారే లేని పరిస్థితి.

ఇది ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారింది. దీంతో పార్టీ మీద విమర్శలు.. ఆరోపణలే తప్పించి.. వాటికి అంతే ధీటుగా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో జరుగుతున్న డ్యామేజ్ ను ఆలస్యంగా గుర్తించిన పార్టీ.. తాజాగా టీవీ డిబేట్లకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న అంతర్గత బ్యాన్ ను ఎత్తేసినట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో టీవీ డిబేట్లలో గులాబీ నేతలు ఇరగదీయటం ఖాయమన్న మాట చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ అంతలా దూసుకెళ్లే అవకాశం ఉంటుందా? అన్నది అసలు ప్రశ్న. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News