ఎదగాలంటే ఆ రెండూ ఉండాల్సిందేనట!

Update: 2015-11-01 17:30 GMT
దేశంలో అసహన భావం పెరుగుతున్న వాతావరణం ఆర్థికాభివృద్ధికి ఏమాత్రం మంచిది కాని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సూచించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, సహనభావానికి పట్టం కట్టేందుకు కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.

కేంద్రంలో కాని, రాష్ట్రాల్లో కాని ఏ ప్రభుత్వం యొక్క ప్రధమ ప్రాధాన్యత ఎప్పటికీ ఒకటిగానే ఉంటుందని ప్రతి పౌరుడిలో నమ్మకాన్ని పెంపొందించి అభివృద్ధిలో ఆసక్తి కలిగించాలని నారాయణమూర్తి హెచ్చరించారు. ఇటీవల దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనల రీత్యా మైనారిటీల్లో, వలస వచ్చిన వారిలో ఒక మేరకు భయం చోటు చేసుకుందని ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. ప్రజల్లో భయ సందేహాలు, నిరాశ, ఆందోళనలు వైదొలగనంతవరకు దారిద్ర్యం, అసమానత్వం, వ్యత్యాసాలను పారదోలడం కష్టసాధ్యమని ఆయన పేర్కొన్నారు.

నేను రాజకీయనేతను కాదు. రాజకీయాల్లో ఆసక్తీ లేదు. దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలపై నేను వ్యాఖ్యానించాలని భావించడం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఇది నా దేశం,దాని ప్రగతి కోసం నేను పనిచేస్తాను అనే భావాన్ని ప్రేరేపించాలని మూర్తి అన్నారు. 300 సంవత్సరాల చరిత్ర అనుభవాలను మనం మర్చిపోరాదని, మెజారిటీ మతస్తులు మైనారిటీ మతస్తులను గౌరవించనిదే, వారిని పీడించటం ఆపివేయనిదే ఏ దేశమూ ప్రగతిబాటలో నడవలేదని ఆయన హెచ్చరించారు.

1967లో దక్షిణభారతీయుల పట్ల బొంబాయిలో వ్యవహరించిన తీరును, వారిని అవమానించిన తీరును మూర్తి గుర్తుకు తెచ్చుకుంటూ,. దేశంలో ఒక మతం మరొక మతంతో ఘర్షణవైఖరి అవలంబిస్తే అలాంటి స్థితిలో శాంతి, ప్రగతి సాధ్యం కాదని చెప్పారు. అభివృద్ధి పథంలో నడవాలంటే సానుకూల వాతావరణాన్ని కల్పించడం ఎంతో అవసరమని అప్పుడే దారిద్ర్యాన్ని మనం పారదోలగలమని మూర్తి వివరించారు.

గోమాంసం భక్షణపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని మైనార్టీల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.

దేశ ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని నారాయణమూర్తి సూచించారు. మతాల మధ్య కాని, ప్రాంతాల మధ్య కాని సామరస్యం ఉండాలన్నారు. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టేలా ఉండటంతో.. సర్వత్రా చర్చనీయాంశమైంది. పైగా పాలక భారతీయ జనతాపార్టీలోని చీలికవాదులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం నిరోధించాలని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో నారాయణ మూర్తి వ్యాఖ్యలు సంచలనం గొలిపించాయి
Tags:    

Similar News