దేశ ప్రగతిపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు..!

Update: 2022-12-19 00:30 GMT
ఒక దేశం యొక్క అభివృద్ధిని ఎలా కొలుస్తారు? దీనికి కొలమానం ఏంటి అని అడిగితే దానికి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. రాజకీయ నాయకులైతే అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతూ ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీలన్నీ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని బల్లగుద్ది చెబుతుంటాయి.

ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దేశం తిరోగమన దిశలో పయనిస్తుందని విమర్శలు చేయడం కామన్ అయిపోయింది. కానీ దేశ ప్రగతి విషయంలో మాత్రం మేధావులు.. ఆర్థిక నిపుణులు మరోలా అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా విశాఖలోని ఏయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఇన్ఫోసిస్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన దేశ ప్రగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఆర్థిక శక్తిగా మార్పు చెందాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని గుర్తు చేశారు. సమాజంలో అన్నింటి కంటే గౌరవం అనేది ముఖ్యమని.. దానిని కాపాడుకోవాల్సిన అవసరం యువతపై ఉందన్నారు.

యువశక్తి ముందుగా తమలోని అహంకారం అనే పక్షపాతాన్ని జయించాలని ఇన్పోసిస్ నారాయణ మూర్తి సూచించారు. భారతదేశంలో యువ శక్తి అపారంగా ఉందన్నారు. నేటి యువతరంతో తాను కలలు కన్న దేశ ప్రగతి సాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.అలాగే దేశభక్తి కూడిన విద్య గొప్పదని పేర్కొన్నారు.

దేశం యొక్క విజయాన్ని తమ విజయంగా యువత భావించాలని సూచించారు. అప్పుడే యువతలో దేశం కోసం పని చేయాలనే తపన వస్తుందని వెల్లడించారు. మరీ ఆయన వ్యాఖ్యలను యువత ఏవిధంగా అర్థం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Tags:    

Similar News