రాయచోటికి రైలు మార్గం కలేనా?

Update: 2022-02-01 01:30 GMT
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తమ రాష్ట్రం గుండా వెళ్లే రైలు మార్గం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని భావిస్తుంటుంది. ఆ రైలు మార్గం గుండా రైళ్ల రాకపోకలతోపాటు, రవాణా కూడా పెరిగి ఆయా ఊళ్లు డెవలప్ అవుతాయన్న ఆలోచన ఏ రాష్ట్రానికైనా ఉండడం సహజం. ఇలా తమ రాష్ట్రం గుండా రైలు మార్గాలు, కొత్త రైళ్లు వెళ్లాలని కేంద్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసే ఎంపీలు చాాలామంది ఉన్నారు. అయితే, కడప-బెంగళూరు రైల్వే లైన్ విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది. 255 కిలోమీటర్ల రైల్వే లైన్ వేసేందుకు కేంద్రం రెడీగా ఉండగా....మాకు కేవలం 72 కి.మీ రైల్వేలైన్ చాలు అంటోంది ఏపీ ప్రభుత్వం.

255 కి.మీల కడప-బెంగ ళూరు రైల్వేలైన్ వద్దు.. 72 కి.మీల ముద్దనూరు- ముదిగుబ్బ రైల్వే లైన్ చాలు అంటూ రైల్వే బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రభుత్వం రాసిన లేఖతో కడప-బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణం అటకెక్కినట్లేనని టాక్ వస్తోంది. వాస్తవానికి కడప-బెంగళూరు వయా పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లె... 255.40 కి.మీలు రైల్వే లైన్ నిర్మాణానికి రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో 2008-09లో శ్రీకారం చుట్టారు. తాజాగా ఆ అంచనా వ్యయం రూ.3,500 కోట్లకు పెరిగిందని రైల్వే అధికారులు అంటున్నారు. ఈ లైన్ పూర్తయ్యేనాటికి అది రూ.4-5 వేల కోట్లకు చేరుతుందని అంచనా.

అయితే, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.2 వేల కోట్లు భరించాలి. అయితే, ఆ భారం భరించలేకనో, మరే ఇతర కారణాలచేతనో...ఆ ప్రతిపాదనకు ఏపీ సర్కార్ సుముఖంగా లేదు. దానికి బదులుగా ముద్దనూరు-ముదిగుబ్బ వయా పులివెందుల మీదుగా 72 కి.మీలు రైల్వే లైన్ వేస్తే చాలని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. దీనికి అయ్యే ఖర్చు రూ.1,400 కోట్లకు మించదని అంచనా. అంటే ఏపీ ప్రభుత్వంపై సుమారు 700 కోట్ల రూపాయలకు మించి భారం పడదు. దాంతోపాటు సీఎం జగన్ సొంత నియోజకవర్గ కేంద్రం పులివెందులకు కూడా రైల్వే లైన్ వస్తుంది. దీంతో, ఆర్థిక భారం తగ్గించుకోవడం, పులివెందులను కలుపుతూ రైలుమార్గం రావడం వంటి రెండు ప్రయోజనాలకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.

ఒకవేళ ఈ ప్రతిపాదన ఓకే అయితే...రాయచోటికి రైలుమార్గం కలగానే మిగులుతుంది. ప్రభుత్వ చీఫ్‌విప్‌, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై రాయచోటి వాసులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తమ నియోజకవర్గానికి ఆయన రైలు మార్గం తెస్తారని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. మరి, ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News