బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానలో కలకలం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పై ఓ యువకుడు ఇంక్ చల్లాడు. హిస్సార్‌లో ఓ రోడ్‌షో అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు అకస్మాత్తుగా భద్రతావలయాన్ని చేధించుకుని బిగ్గరగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రిపై ఇంక్ చల్లేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అయితే, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడ్ని అడ్డుకోవడంతో ఎక్కువగా ఇంక్ వారిపైనే పడింది.
యువకుడు ఒక్క ఉదుటున ముఖ్యమంత్రిపై ఇంకు చల్లడంతో ఖట్టర్ దుస్తులు, ముఖం, తల భాగంపై కొద్దిగా ఒలికింది. సీఎం వెంటనే తన జేబులోని రుమాలును తీసి తుడుచుకున్నారు. యువకుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. తాను ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ ఎల్ డీ) కార్యకర్తనని ఆ యువకుడు చెప్పినట్ల పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఉన్న పలువురు మీడియాతో మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా అక్కడకు వచ్చిన సదరు యువకుడు తోచుకుంటూ ముందుకు వెళ్లాడని ముఖ్యమంత్రిపై ఇంకు చల్లాడని వివరించారు. కాగా, కొన్ని పార్టీలు దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై అనుచిత ప్రవర్తనకు పాల్పడిన కార్యకర్త విషయంలో ఐఎన్ఎల్‌డీ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.