తూర్పు రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కిళ్లీల వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఒడిశా నుంచి మొదలుపెట్టి కలకత్తా మీదుగా సిక్కిం - అరుణాచల్ ప్రదేశ్ వరకు అంతటా ప్రజలు పాన్ ప్రియులే. కలకత్తా పాన్ అంటే దేశ విదేశాల్లో పాపులర్. ఒడిశా - బెంగాల్ - అస్సాంలలో చాలామంది టీకాఫీలు - అన్నపానీయాలు లేకుండా రోజంతా గడిపేస్తారు కానీ కిళ్లీ వేసుకోకుండా అర గంట కూడా ఉండలేరు. సీఎంల నుంచి సామాన్యుల వరకు అందరకూ అదే అలవాటు. నోట్లో ఎప్పుడూ పాన్ నములుతూ ఉండాల్సిందే. తాజాగా అస్సాంలోని ఖైదీలైతే జైళ్లో పాన్ దొరకడం లేదంటూ ఏకంగా కోర్టులో కేసేశారు.
గౌహతి సెంట్రల్ జైల్ క్యాంటిన్ లో పాన్ అమ్మకాలు - వినియోగాన్ని నిషేధిస్తూ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను అక్కడి ఖైదీలు సవాల్ చేశారు. 11 మంది ఖైదీలు దీనిపై గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఈ 11 మంది ఖైదీలూ జైలు క్యాంటిన్ లో పాన్ వినియోగం - విక్రయాలను అనుమతించాలంటూ చేసిన విజ్ణప్తిని సీజేఎమ్ తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే... దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. అక్కడి ప్రజల్లో వాళ్లువీళ్లు అన్న తేడా లేకుండా అంతా పాన్ ప్రియులే ఉండడం.. జడ్జిలు - న్యాయవాదుల్లోనూ ఆ వర్గం ఉండడంతో దీనిపై ఎలా స్పందిస్తారన్న ఆసక్తి అంతటా నెలకొంది. మరి ఈ కేసులో న్యాయమూర్తి ఆ ఖైదీలకు 'పాన్" భిక్ష పెడతారో లేదో చూడాలి.