ఉద్యోగ సమస్యలపై హైకోర్టులో విచారణ.. కీలక ఆదేశాలు

Update: 2022-02-01 09:32 GMT
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం ముదిరిపాకాన పడుతోంది. అటు ప్రభుత్వం కొత్త జీతాలు, పీఆర్సీ అమలు చేస్తుండగా.. ఉద్యోగులు తీసుకోం అంటూ ఉద్యమ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే పీఆర్సీని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు జీతాల నుంచి ఎటువంటి రికవరీలు చేయవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీ కొత్త జీవోలను మూడు వారాల పాటు యథాస్థితిలో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పీఆర్సీ వలన తమకు అన్యాయం జరుగుతుందనేది పిటీషనర్ కృష్ణయ్య వాదించారు. జీతాలు, అలవెన్సులో తగ్గుదల కనిపించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పీఆర్సీ జీవోలపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

-పీఆర్సీలో జీతాలు తగ్గాయంటూ పిటీషన్ విచారణ

ఇక పీఆర్సీలో జీతాలు తగ్గాయంటూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై మంగళవారం విచారణ జరిగింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని  ప్రభుత్వానికి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. పీఆర్సీపై నియమించిన అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదని న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీవోల్లో ఏరియర్స్ కట్ చేయడాన్ని ప్రస్తావించారు.

కాగా ఈ వ్యవహారంలో అనేక అంశాలు ముడిపడి ఉండడంతో ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.

-ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి ఇవ్వొద్దని పిటీషన్

ఏపీ ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’కు అనుమతి ఇవ్వవద్దని ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఉద్యోగుల సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని లంచ్ మోషన్ విచారణను పిటిషనర్ కోరారు. అయితే కోర్టు ఈ విషయంపై తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.  ప్రభుత్వానికి రిప్రజంటేషన్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. కోవిడ్ మేనేజ్ మెంట్ రూల్స్ ఉన్నందున ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.
Tags:    

Similar News