ఈ ‘‘విరాట్’’ ఎంత మొనగాడంటే..?

Update: 2016-02-09 07:15 GMT
‘‘విరాట్’’ అన్న మాట విన్న వెంటనే ప్రఖ్యాత క్రికెటర్ విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తారు. అదే.. ఐఎన్ ఎస్ విరాట్ అన్న వెంటనే.. భారీ యుద్దనౌక మదిలో మెదులుతుంది. ఇప్పుడా నౌక ఏపీ సొంతం కానుంది. కొన్నేళ్లుగా తన సేవలు అందించిన ఈ యుద్ధ నౌకను ఈ జూన్ నుంచి సేవల నుంచి తప్పించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న చంద్రబాబు తెలివిగా కేంద్రం దగ్గర ఒక ప్రతిపాదన చేసిన ఈ భారీ విరాట్ ను సొంతం చేసుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.

సేవల నుంచి ఉపసంహరించుకోవాలని భావిస్తున్న విరాట్ ను తమకు ఇస్తే.. దాన్నో హోటల్ గా మారుస్తామని ఆయన కోరటం.. అందుకు కేంద్రం ఓకే చెప్పేయటం జరిగిపోయాయి. ఈ భారీ నౌక భారీతనం చెప్పాలంటే గణాంకాల్లోకి వెళితే దాని గొప్పతనం తెలియటంతోపాటు.. బాబు వేసిన ఐడియా ఏపీకి ఎంతగా లాభిస్తుందో ఇట్టే అర్థమవుతుంది.

విరాట్ ఎంత భారీ అంటే..

విరాట్ బరువు 27 వేల టన్నులు.. పొడువు 741 అడుగులు ఉండే విరాట్ 1987 నుంచి సేవల్ని అందిస్తోంది. ఇందులో మొత్తం వెయ్యి కంపార్ట్ మెంట్లు ఉన్నాయి. వీటిని 1500 గదులుగా మార్చే వీలుంది. ఇందులో దాదాపు 2 వేల మంది బస చేసే అవకాశం ఉంది. ఇందులోని గదుల్ని శుభ్రం చేయించి.. చక్కగా డెకరేట్ చేయగలిగితే  ఇదో చక్కటి ప్లేస్ గా మారే ఛాన్స్ ఉంటుంది.

500 మంది కూర్చునే కాన్ఫరెన్స్ హాలుతో పాటు ఒకేసారి 20 విమానాలు.. 8 హెలికాఫ్టర్లు దిగే అవకాశం ఉంది. ఇంతపెద్ద నౌకను ఫ్లోటింగ్ నౌకగా మారిస్తే.. ఇదో కేసినోలా మారటమే కాదు.. పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షించే వీలుంది. అయితే.. దీని నిర్వహణను వుడా.. నేవీ.. ప్రైవేటు సంస్థలు కలిసి కానీ ప్రాజెక్టు చేపడితే మంచి వాణిజ్యకార్యక్రమంగా మారే వీలుంది. ఫుట్ బాల్ స్టేడియం అంత సైజు ఉండే డెక్ ను.. సరిగ్గా వినయోగించుకోవాలే కానీ.. ఇదో అద్భుతమైన పిక్నిక్ స్పాట్ గా మారే వీలుంది.

చిత్రమైన అనుభూతిని ఇచ్చే విరాట్ ను ఫ్లోటింగ్ హోటల్ గా మార్చి.. హెలికాఫ్టర్లో దీని దగ్గరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటమా.. మరో విధంగా అన్న విషయంపై ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు కారణంగా ఏపీకి పేరు ప్రఖ్యాతులతో పాటు.. వాణిజ్యపరంగా ఇదో చక్కటి ప్రాజెక్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. 10వేల ఇళ్లకు అవసరమైన విద్యుత్తును సరఫరా చేసే సామర్థ్యం ఉన్న జనరేటర్లు చూస్తే.. ఇదెంత పెద్దదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. బాబు అనుకున్నట్లే విరాట్ కానీ సరిగా వినియోగించుకోగలిగితే.. చంద్రబాబు హయాంలో ఒక సూపర్ టూరిజం స్పాట్ ను తయారు చేసిన ఘనత ఆయన సొంతం అవుతుంది. మరి.. ఆ దిశగా బాబు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.
Tags:    

Similar News