బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్ పథకం .!

Update: 2021-11-17 06:42 GMT
ఈ ఏడాది బెంగాల్‌ జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ‘ఇంటింటికి రేషన్‌ బియ్యం’ కార్యక్రమం మాదిరి పశ్చిమ బెంగాల్‌లో కూడా అమలుచేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలోని 1.5 కోట్ల రేషన్‌ కార్డుదారులందరూ ఇకపై చౌకధరల దుకాణానికి వెళ్లనవసరం లేదు.’ అని మేనిఫెస్టోలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె చెప్పినట్టే ఇంటింటికి రేషన్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇంటింటికీ రేషన్‌ ను సరఫరా చేసే పథకాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రారంభించారు. దువారే రేషన్ పేరుతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

ఈ పథకం వల్ల 10 కోట్ల మంది ప్రజలకు లబ్ది కలుగుతుందని మమత బెనర్జీ చెప్పారు. తాజాగా మధ్యప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరింది. రేషన్ ఆప్ కె గ్రామ్ పేరుతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. తొలిదశలో 89 గిరిజన గ్రామాలు, బ్లాకులకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఆయా గ్రామాల్లో నివాసం ఉండే కుటుంబాల వారికి ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది. క్రమంగా దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తుంది. గిరిజన గ్రామాల్లో ఇంటింటికీ రేషన్‌ ను అందజేయడానికి ప్రత్యేకంగా 12 వాహనాలను కొనుగోలు చేసింది చౌహాన్ సర్కార్. ఈ వాహనాల ద్వారా 89 గ్రామాలు, బ్లాకులకు రేషన్‌ను సరఫరా చేస్తుంది. ఈ వాహనాలను శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు.

అందులో అమర్చిన ఎలక్ట్రానిక్ కాటాలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద చౌక డిపోల ద్వారా సరఫరా చేసే నిత్యావసర సరుకులను గిరిజన గ్రామాలకు పంపిణీ చేయడం సంతోషాన్ని ఇస్తోందని ఆయన తెలిపారు. ప్రతి వాహనానికీ ఇద్దరేసి చొప్పున రేషన్ సిబ్బందిని నియమించామని, ఫలితంగా- స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పించినట్టయిందని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు రేషన్‌ను పంపిణీ చేసే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆ సామాజిక వర్గానికే చెందిన యువకులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. నిత్యావసర సరుకుల కోసం కార్డుదారులెవరూ రేషన్ దుకాణాలకు వెళ్లనక్కర్లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.

రేషన్ దుకాణాలే వారి ఇళ్ల వద్దకు వెళ్తున్నాయని, ఆ సౌకర్యాన్ని తాము కల్పించామని చెప్పారు. రేషన్ దుకాణాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది. కర్ణాటక సర్కార్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తామంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో సీఎం జగన్‌ జనవరి 21వ తేదీన ‘ఇంటింటికి రేషన్‌’ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News