ఏపీ దళిత మంత్రికి అవమానం జరిగిందంటే అంతటి ఆగ్రహం

Update: 2022-02-18 17:30 GMT
తప్పును తప్పుగా.. ఒప్పును ఒప్పుగా చూపిందే రోజులు పోయి.. తాము ఎవరి పక్షాన నిలుస్తామో.. వారేం చేసినా సరే.. అడ్డగోలుగా సమర్థించటం ఈ మధ్యన దరిద్రపుగొట్టు కల్చర్ గా మారింది. ఫలానా తప్పు జరిగిందన్నంతనే.. ఆ తప్పు చూపించిన వేలు ఏ పార్టీకి చెందింది? ఏ కులానికి చెందింది? ఏ మతానికి చెందింది? ఏ వర్గానికి చెందిందన్న దరిద్రపు లోతుల్లోకి పోవటం.. పనికిమాలిన వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. అప్పుడెప్పుడో మీ ముత్తాత అలా చేశారు.. ఆ విషయం మీద మాట్లాడవు కానీ.. ఇప్పటి విషయాల మీద మాట్లాడతావా? అనటమే తప్పించి.. తప్పును సరిచేసుకుంటే వేలెత్తి చూపే వాడికి అవకాశం ఉండదన్న సోయి లేని వైనం ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో ఈ జాడ్యం మరింత పెరిగింది.

తాజాగా ఏపీ హోం మంత్రి సుచరితకు అవమానం జరిగింది. ఆ మాటలో వేరే వాదనకే తావు లేదు. ఒక మహిళా నేతగా.. దళిత వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు.. అక్కడ ఏర్పాటు చేసే శిలాఫలకం మీద ఆమె పేరు లేకపోవటం కచ్ఛితంగా అవమానమే. దీనికి వేరే వాదనలే అవసరం లేదు. మంగళగిరి నియోజకవర్గంలో అక్షయ పాత్ర కిచెన్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించటం.. గోశాలకు శంకుస్థాపన చేయటం లాంటి కార్యక్రమాలకు సిద్ధం చేసిన శిలాఫలకంలో మంత్రి సుచరిత పేరు గల్లంతైంది.

నిజానికి ఆమె ఒక్క పేరు మాత్రమే కాదు.. ప్రోటోకాల్ ప్రకారంగా ఉండాల్సిన ఎంపీ గల్లా జయదేవ్ పేరు.. జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి శ్రీరంగనాధ రాజు పేరును సైతం నిర్వాహకులు మిస్ అయ్యారు. ఇటీవల కాలంలో అధికారపక్షంలో ఎవరున్నా విపక్షానికి సంబంధించిన వారి పేర్లు వేయాల్సి వస్తే స్కిప్ చేయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆనవాయితీగా మారి.. తరచూ ఏదో ఒక వివాదం తెర మీదకు రావటం తెలిసిందే. తాజా ఎపిసోడ్ కు వస్తే.. దళిత మంత్రిగా సుచరిత పేరు శిలాఫలకం మీద లేకపోవటంపై అంత లొల్లి చేయాల్సిన అవసరం ఏమిటన్న వాదనను వినిపిస్తున్నారు.

మాటకు ముందు ఒకసారి.. మాట చివర ఒకసారి దళిత మంత్రి అనే వేళ.. హోం మంత్రిగా దళిత వర్గానికి చెందిన మహిళకు జగన్ అవకాశం ఇచ్చారని ఎప్పుడైనా పొగిడారా? అని ప్రశ్నించటం గమనార్హం. ఇదంతా చూస్తే.. తప్పు చేసిన వారి తప్పుల్ని ఎత్తి చూపించటానికి ముందు.. వారిని భారీగా పొగిడిన ట్రాక్ రికార్డు ఉండాలా? అప్పుడు మాత్రమే విమర్శకు అవకాశం ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. దీనంతటికి బదులు.. నిజమే.. అలాంటి తప్పులు జరగకూడదు కదా? అన్న మాట వస్తే.. ఈ రచ్చంతా ఉండదు కదా?
Tags:    

Similar News