మైదానంలో అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ దుశ్చ‌ర్య‌..!

Update: 2021-06-12 16:30 GMT
ప్ర‌పంచ క్రికెట్లో క‌నీవినీ ఎరుగ‌ని దుశ్చ‌ర్య‌ బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది సాధార‌ణ క్రికెట‌ర్ కాదు.. బంగ్లా జాతీయ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న క్రికెట‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. అత‌నెవ‌రో కాదు ఆల్ రౌండర్ షకిబుల్ హసన్. క్రికెట్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ.. మ‌రే క్రికెట‌ర్ కూడా ప్ర‌వ‌ర్తించ‌ని విధంగా మైదానంలో వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి తీరుప‌ట్ల‌ స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వాళ్ల దేశంలో ఢాకా ప్రీమియ‌ర్ డివిజ‌న్ టీ20 లీగ్ నిర్వ‌హిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా మ‌హ‌మ్మ‌దెన్ స్పోర్టింగ్ క్ల‌బ్ - అబ‌హానీ లిమిటెడ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ష‌కిబుల్ హ‌స‌న్ మ‌హ్మ‌దెన్ స్పోర్టింగ్ క్ల‌బ్ త‌ర‌పున ఆడుతూ.. బౌలింగ్ చేస్తున్నాడు. అత‌ను బాల్ డెలివ‌రీ చేసి ఎల్బీడ‌బ్ల్యూకు అప్పీల్ చేశాడు. దీనికి అంపైర్ నిరాక‌రించాడు.

అంతే.. స‌హ‌నం కోల్పోయిన ష‌కిబుల్ హ‌స‌న్‌.. అంపైర్ మీద‌కు దూసుకెళ్తూ కాలితో వికెట్ల‌ను త‌న్నాడు. దీంతో.. వికెట్ కింద ప‌డిపోయింది. ఆ త‌ర్వాత పీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలోనూ అంపైర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ.. వికెట్ల‌న్ పీకి ప‌డేశాడు. తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సాధార‌ణ క్రికెట్ ల‌వ‌ర్స్ నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ష‌కిబుల్ హ‌స‌న్ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్ అయి ఉండి.. ఇదేం దుశ్చ‌ర్య అంటూ మండిప‌డుతున్నారు. ఇది ఖ‌చ్చితంగా ఐసీసీ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని అంటున్నారు. మ‌రి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏమైనా చ‌ర్య తీసుకుంటుందా? అనే చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News