జీ వాటా కోసం రంగంలోకి దిగిన దిగ్గ‌జాలు!

Update: 2019-02-26 05:02 GMT
పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల‌తో కిందా మీదా ప‌డుతున్న జీ చాన‌ళ్ల సంస్థ జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో కీల‌క వాటాను అమ్మేందుకు కంపెనీ ప్ర‌మోట‌ర్ సుభాష్ చంద్ర రెఢీ కావ‌టం తెలిసిందే. మొన్న‌టివ‌ర‌కూ ఆర్థిక ఇబ్బందుల్లో జీ ఉంద‌న్న మాట వినిపించినా.. అధికారికంగా వెల్ల‌డి కాలేదు. ఎప్పుడైతే వాటాను అమ్మేందుకు సుభాష్ చంద్ర డిసైడ్ అయ్యారో ఒక్క‌సారిగా ఈ వ్య‌వ‌హారం మీద అంద‌రి దృష్టి ప‌డ‌ట‌మే కాదు.. షేరు ధ‌ర ఢ‌మాల్ అంది. జీ లో దేశీయ‌.. విదేశీ సంస్థ‌లతో క‌లుపుకొని ప్ర‌మోట‌ర్ల వాటా మొత్తం 41.62 శాతం. ఇదిలా ఉంటే దేశీయ ప్ర‌మోట‌ర్ సంస్థ‌ల వాటాలో 85 శాతం మేర బ్యాంకులు.. ఆర్థిక సంస్థ‌ల తాక‌ట్టులో ఉంది.

ఈ నేప‌థ్యంలో త‌న వాటాను వ్యూహాత్మ‌క భాగ‌స్వామికి అమ్మాల‌న్న ఆలోచ‌న‌కు సుభాష్ చంద్ర రావ‌టం.. ఆ విష‌యాన్ని చెప్పేయ‌టంలో జీ మీద ప‌లువురు క‌న్నుప‌డింది. దేశీయంగా రిల‌య‌న్స్ అంబానీ మొద‌లుకొని అంత‌ర్జాతీయ సంస్థ‌లైన సోనీ.. చైనా దిగ్గ‌జం అలీబాబా మొద‌లు అమెరికాకు చెందిన కేబుల్ దిగ్గ‌జం కామ్ కాస్ట్ తో స‌హా ప‌లు కంపెనీలు జీలో వాటా కోసం ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న మార్కెట్ స‌మాచారం ప్ర‌కారం జీ వాటా కొనుగోలులో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిల‌య‌న్స్ తో పాటు.. చైనాకు చెంది టెన్సెంట్.. ఆలీబాబాతో స‌హా టెక్నాల‌జీ దిగ్గ‌జం యాపిల్ సైతం బ‌రిలోకి దిగిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. వాటా కొనుగోలు కోసం బిడ్ లు స‌మ‌ర్పించిన కంపెనీలు కొన్ని మాత్ర‌మే ఉన్నాయి. రానున్న రోజుల్లో మ‌రిన్ని కంపెనీలు బిడ్ లు స‌మ‌ర్పించే అవ‌కాశం ఉందంటున్నారు.

జీ వాటాను సొంతం చేసుకోవ‌టానికి చాలానే సంస్థ‌లు దృష్టి సారించినా.. ఈ రేసులో సోనీ కార్పొ ముందంజ‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. భార‌త శాటిలైట్ టెలివిజ‌న్ రంగంలోకి అంద‌రి కంటే ముందుగా ప్ర‌వేశించిన సోనీ పిక్చ‌ర్స్ నెట్ వ‌ర్క్ ఇప్ప‌టికే వివిధ జోన‌ర్ల‌తో కొత్త చాన‌ళ్ల‌ను ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం వేగంగా వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది.

రెండేళ్ల క్రితం జీ స్పోర్ట్స్.. బిజినెస్ ను రూ.2400 కోట్ల‌కు కొనుగోలు చేయ‌ట‌మే కాదు.. మ‌రాఠి జ‌న‌ర‌ల్ ఎంటర్‌ టైన్ మెంట్ రంగంలోకి దిగింది. దీంతో.. ప్రాంతీయ చాన‌ళ్ల మీద కూడా సోనీ దృష్టి సారించింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. జీ చాన‌ళ్ల ప్ర‌త్యేక‌త ఏమంటే.. న‌గ‌ర‌.. ప‌ట్ట‌ణ వీక్ష‌కుల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ చాన‌ళ్లు బాగా పాతుకుపోయాయి. దీంతో.. జీ వాటాను సొంతం చేసుకుంటే మార్కెట్లో మ‌రింత బ‌లమైన ప్లేయ‌ర్ గా మారే అవ‌కాశం ఉంద‌ని సోనీ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే సోనీ కీల‌క అధికారులు సుభాష్ చంద్ర ఇంట్లో భేటీ కావ‌టం చూస్తే.. జీ వాటా సోని చేతికి చిక్కుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News