జంతువుల నుండే కరోనా .. స్పష్టం చేసిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం !

Update: 2021-07-10 09:31 GMT
కరోనా వైరస్ మహమ్మారి .. చైనాలోని వుహాన్ సిటీలో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ కరోనా కారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని ఆసుపత్రి పాలు చేసింది. ఈ మహమ్మారి దాటికి కొన్ని లక్షల మంది మరణించారు. ఇంకా వైరస్ ముప్పు వెంటాడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మానవాళికి ముప్పుగా మారిన ఈ మహమ్మారి ఎక్కడ, ఎలా పుట్టింది అనేదాని పై ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు. ఈ వైరస్ మానవ సృష్టే అని, చైనాలోని వుహాన్ ల్యాబ్ లో తయారైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌ ప్రయోగశాలలో తయారైందని చెప్పేందుకు ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి తాజాగా స్పష్టం చేసింది.

జంతువుల నుంచే కరోనా మహమ్మారి  మనుషుల్లోకి ప్రవేశించి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ పుట్టుక సంగతిని తేల్చేందుకు, ఇప్పటివరకు లభించిన శాస్త్రీయ ఆధారాలన్నింటినీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌ లోని ఎడిన్‌ బరో యూనివర్సిటీ, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, చైనాలోని జియావోటాంగ్‌-లివర్‌ పూల్‌ యూనివర్సిటీ సహా ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధక సంస్థలకు చెందిన 21 మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. కరోనా వైరస్‌ ల్యాబ్ లో అనుకోకుండా ఆవిర్భవించి ఉండొచ్చన్న వాదనను పూర్తిగా తోసిపుచ్చలేమని వారు తెలిపారు. అయితే ల్యాబ్‌ నుంచే అది లీక్‌ అయ్యిందని చెప్పే ఆధారాలూ ప్రస్తుతానికి లేవన్నారు. మహమ్మారి తొలినాళ్లలో నమోదైన కేసులకు, వుహాన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ  కి మధ్య సంబంధాలేవీ కనిపించలేదని చెప్పారు. జంతువుల నుంచి మానవుల్లోకి వైరస్‌ ప్రవేశించిందన్న వాదనను బలపర్చేలా మాత్రం తగినన్ని శాస్త్రీయ ఆధారాలున్నాయని వెల్లడించింది.

ఏడాదికి పైగా నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ వో) వెల్లడించింది. సంపన్న దేశాలు ఒక వైపు ఆంక్షలను సడలిస్తుండగా, మరోవైపు ఆసియా దేశాలు తాజా కేసులతో పోరాడుతున్నాయని తెలిపింది. ఆసియా వ్యాప్తంగా కొత్త లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.  ఇప్పటికే ఈ కరోనా ఎలా వదులుతుందా, ఎప్పటికి వదులుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ల తయారీ కంపెనీలు... ఇదుగో, అదుగో అంటుంటే, నెలలు గడుస్తున్నాయే తప్ప ఇప్పటివరకూ కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే వ్యాక్సిన్ రాలేదు.  వ్యాక్సిన్ వచ్చినా, అది పనిచేస్తుందో లేదో తెలియట్లేదు. అలాగే చాలామంది వ్యాక్సిన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు.  మనుషుల నుంచే కరోనా వైరస్ జంతువులకు సోకుతోందని మనకు తెలుసు. అదే జంతువుల నుంచి అది మనుషులకు సోకడం మొదలుపెడితే  దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం.  కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News