మత అసహనం వెనుక డబ్బు సంచులు

Update: 2015-11-17 07:04 GMT
బీహార్ ఎన్నికల సమయంలో భారీ ఎత్తున మత అసహనం మీద చర్చ జరిగింది. దీని మీద మీడియా సైతం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో మరే సమస్యలు లేనట్లుగా మీడియా పెద్ద ఎత్తున వార్తల్ని ఇస్తే.. విపక్షాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడటం.. దీని గురించి వ్యాఖ్యలు చేయటం కనిపించింది. ఇక.. మేధావులు.. ప్రముఖులు సైతం తమకిచ్చిన పురస్కరాల్ని తిరిగి ఇచ్చేస్తూ నిర్ణయాల్ని ఒకరి తర్వాత ఒకరు ప్రకటించటం జరిగింది.

ఆశ్చర్యకరంగా బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలై.. బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు దారుణ పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా మత అసహనంపై చర్చ ఒక్కసారిగా ఆగిపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. మతఅసహనం అంటూ ఉంటే ఎన్నికల సమయంలో ఎలా ఉందో.. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక కూడా ఉండాలి. తీవ్రతలో తేడా ఉండొచ్చు కానీ.. ఘటనలు అయితే జరుగుతూనే ఉండాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలై.. మోడీ పరాజయం సంపూర్ణం అయిన వెంటనే.. ఆ చర్చ.. ఘటనలు మాయమైపోవటం గమనార్హం.
మొన్నటివరకూ ఉన్న మతఅసహనం ఇప్పుడు మాయమైన విషయాన్ని కేంద్రమంత్రి వీకే సింగ్ తనదైన శైలిలో ప్రస్తావించారు. బీహార్ ఎన్నికలకు ముందు కావాలనే ఇలాంటి చర్చను తీసుకొచ్చారని.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇది మాయమైందని చెబుతూ.. ఇదంతా భారీగా డబ్బులు అందుకున్న కొందరి కల్పనగా వ్యాఖ్యానించారు.

తాను చేస్తున్న వాదనకు బలం చేకూరుస్తూ ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక చర్చిలో జరిగిన దొంగతనాన్ని.. చర్చి మీద దాడిగా చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటికి మీడియా వంత పాడుతోందని వ్యాఖ్యానించారు. మత అసహనం వ్యవహారం వ్యూహాత్మకమని చెబుతున్న కమలనాథులు.. విపక్షాల మీద విరుచుకుపడుతున్న వారు.. ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని ఎందుకు గుర్తించనట్లు? ఎందుకు సమర్థంగా అడ్డుకోనట్లు..?
Tags:    

Similar News