ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇక మరిన్ని రోజులు!

Update: 2019-10-22 12:58 GMT
ఇప్పటికే ప్రతియేటా నెలన్నర పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగుతూ ఉంది. నెలన్నర పాటు టీట్వంటీ క్రికెట్ తో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. ప్రధాన నగరాల పేర్లతో ఏర్పడిన టీమ్ ల మధ్యన రసవత్తర క్రికెట్ అలా కొనసాగుతూ ఉంది. ఆదరణ విషయంలో ఐపీఎల్ బ్రహ్మాండమైన స్థాయిలో ఉంది. ఇక కాసుల పరంగా కూడా  ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంగతి చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లకు అత్యంత  భారీ పారితోషకాలు ఇచ్చి ఈ మ్యాచ్ లను ఆడిస్తున్నారు. ఐపీఎల్ పుణ్యమా అని బీసీసీఐ ఆర్థిక శక్తి అనేక రెట్లు పెరిగింది.

ఈ బంగారు బాతుతో మరిన్ని గుడ్లు పెట్టించుకోవడానికి ఇప్పుడు  బీసీసీఐ రెడీ అవుతున్నట్టుగా ఉంది. అందులో భాగంగా మరి కొన్ని రోజుల పాటు  ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తూ ఉంది. అందులో భాగంగా మార్పులకు రంగం రెడీ అవుతోందట.

ఇన్నేళ్లూ ప్రతి సమ్మర్ లోనూ నెలన్నర పాటు  ఐపీఎల్ ను నిర్వహిస్తూ వచ్చారు. ఆ షెడ్యూల్ మేరకు కొన్ని రోజుల పాటు రోజుకు రెండు  మ్యాచ్ లు - మరి కొన్ని  రోజులు రోజుకు ఒక  మ్యాచ్ మాత్రమే నిర్వహిస్తూ  వచ్చారు. వీకెండ్స్ లో - మరి కొన్ని రోజుల్లో రోజుకు రెండు మ్యాచ్ ల చొప్పున జరిగేవి. అయితే  ఇక నుంచి ప్రతి రోజూ ఒక్క మ్యాచ్చే నిర్వహించాలని అనుకుంటున్నారట.

దాని వల్ల వీక్షకుల సంఖ్య  పెరుగుతుందనేది లెక్క! మధ్యాహ్నం మూడింటికే మ్యాచ్ ప్రారంభం అయితే కొంతమంది చూడలేకపోతున్నారని, అదే సాయంత్రం ఆరు  గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం అయితే వీక్షకులు పెరుగుతారనేది  బీసీసీఐ లెక్కగా తెలుస్తోంది.

అయితే ..అలా రెండు నెలల పాటు  లీగ్ ను నిర్వహిస్తే - విదేశీ అటగాళ్లు  అందుబాటులో ఉండటం సాధ్యం అవుతుందా? అనేది బీసీసీఐ ఆలోచించుకోవాల్సిన అంశమేమో!
Tags:    

Similar News