పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ విలువ.. ఎన్ని కోట్ల నష్టమంటే?

Update: 2021-03-12 00:30 GMT
కరోనా కారణంగా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా యావత్ ప్రపంచం ప్రభావితమైంది. అయితే.. సంక్షోభాల్ని సానుకూలంగా మార్చుకున్నకొందరు.. కొన్ని సంస్థలు మాత్రం వేలాది కోట్ల రూపాయిల్ని వెనకేసుకున్నాయి. తాజాగా వెల్లడైన నివేదిక ప్రకారం.. భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ కు కరోనా సెగ తగిలింది. మహమ్మారి కారణంగా దీని బ్రాండ్ వాల్యూ భారీగా తగ్గినట్లుగా చెబుతున్నారు. డఫ్&ఫెల్ఫ్స్ అనే సంస్థ తన నివేదిక ప్రకారం చూస్తే..ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ మాత్రమే కాదు.. ఆయా జట్లకు ఉన్న బ్రాండ్ విలువను కూడా దెబ్బ తీసిన వైనాన్ని పేర్కొంది.

సదరు నివేదిక ప్రకారం 2020లో ఐపీఎల్ బ్రాండ్ విలువ దాదాపు 3.6 శాతం తగ్గిందని.. దాని విలువ రూ.45,800 కోట్లకు పరిమితమైనట్లుగా తేల్చారు.  కరోనాకారణంగా గత సీజన్ ను ప్రత్యేక పరిస్థితుల్లో దుబాయ్ లో నిర్వహించారు. ప్రేక్షకుల్ని గ్రౌండ్ లోకి అనుమతించకుండా.. మ్యాచుల్ని లైవ్ లో చూసే అవకాశాన్ని కల్పించారు. ఇలాంటి పరిణామాలతో 2019లో ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ.47,500 కోట్లు కాగా.. తాజాగా రూ.45,800 కోట్లుగా తేలింది. 2018తో పోలిస్తే.. 2019లో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 7 శాతం పెరిగితే.. ఈ సారి అందుకు భిన్నంగా 3.6 శాతం పడిపోయింది.

ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ మాత్రమే కాదు.. అందులోని ఫ్రాంఛైజీల విలువ కూడా తగ్గిపోయినట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. రిలయన్స్ అంబానీకి చెందిన ముంబయి ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ తగ్గినప్పటికి.. మిగిలిన ఫ్రాంఛైజీలతో పోలిస్తే.. దాని విలువ ఉన్నట్లుగా చెబుతున్నారు. 2019తో పోలిస్తే తాజాగా 5.9 శాతం బ్రాండ్ వాల్యూను కోల్పోయింది. దీంతో.. ముంబయి ఇండియన్స్ టీం విలువ రూ.761 కోట్లకు పరిమితమైంది.

ఇక.. చెన్నై సూపర్ కింగ్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తమ విలువను పెద్ద ఎత్తున నష్టపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ అత్యధికంగా 16.5 శాతం వాల్యూకోల్పోతే.. కోల్ కతా నైట్ రైడర్స్ విలువ 13.7 శాతానికి పడిపోయింది. స్పాన్సర్ షిప్ రెవెన్యూలో కోత పడటం.. స్టేడియంలోకి ప్రేక్షకులు అనుమతించకపోవటం.. ఐపీఎల్ టోర్నీ మొత్తం టీవీ వ్యూస్ తోనూ..యాడ్ రెవెన్యూ మాత్రమే పరిమితం కావటంతో.. దాని బ్రాండ్ విలువ తగ్గినట్లుగా తాజా నివేదిక తేల్చింది.
Tags:    

Similar News