ఐపీఎల్ కు అవకాశం ఇవ్వలేదు కానీ.. టీ20 వరల్డ్ కప్ కు హైదరాబాద్ ఎంపిక

Update: 2021-04-18 04:30 GMT
తాజాగా జరుగుతున్న ఐపీఎల్ కు హైదరాబాద్ ను ఎంపిక చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా కోరటమే కాదు.. ఆ దిశగా ప్రయత్నాలు చేసినా వర్కువుట్ కాలేదు. క్రికెట్ లాంటి క్రీడను.. అందునా ప్రతిష్ఠాత్మకంగా జరిగే మ్యాచుల్ని నిర్వహించాలంటే తెర వెనుక చాలానే జరగాలి. అందుకే.. ఐపీఎల్ టోర్నీని హైదరాబాద్ లో నిర్వహిస్తే.. బాధ్యత అంతా తీసుకుంటామని కేటీఆర్ లాంటి పవర్ ఫుల్ అధికారపక్ష నేత చెప్పినా.. పట్టించుకోని పరిస్థితి. దీంతో.. హైదరాబాదీయులు మాత్రమే కాదు.. తెలుగు వారంతా హర్ట్ అయిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా క్రీడాభిమానులు.. ముఖ్యంగా తెలుగు వారంతా పండుగ చేసుకునే సమాచారం ఒకటి బయటకు వచ్చింది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా దేశ వ్యాప్తంగా తొమ్మిది వేదికల్లో మ్యాచుల్ని నిర్వహించనున్నారు. ఈ తొమ్మిది వేదికల్లో హైదరాబాద్ ఒకటిగా చెబుతున్నారు. అధికారికంగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించనప్పటికి.. బీసీసీఐ మాత్రం మ్యాచ్ ను నిర్వహించేందుకు భాగ్యనగరిని ఎంపిక చేసిన వైనం బయటకు వచ్చింది.

అహ్మదాబాద్.. హైదరాబాద్.. ఢిల్లీ.. ముంబయి.. చెన్నై.. బెంగళూరు.. కోల్ కతా.. ధర్మశాల.. లక్నో ల్లో మ్యాచుల్ని నిర్వహించనున్నారు. మరికొన్ని చోట్ల కూడా మ్యాచుల్ని నిర్వహించే వీలున్నట్లు చెబుతున్నారు. 2016 ప్రపంచ కప్ ను ఏడు వేదికల్లో నిర్వహించారు. తాజాగా అహ్మదాబాద్.. హైదరాబాద్.. చెన్నై.. లక్నోలకు కొత్తగా అవకాశం లభించింది. అయితే.. ఈ వివరాల్ని అధికారికంగా ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా.. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ కు వేదిక ఎక్కడంటారా? మోడీ లాంటి పవర్ ఫుల్ ప్రధాని ఉన్న తర్వాత.. ఆయన ప్రాతినిధ్యం వహించే గుజరాత్ కాకుండా మరో రాష్ట్రంలో పెట్టే అవకాశం ఉందా? అందునా.. ఫైనల్ మ్యాచ్ ను మరెక్కడో కాదు.. నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఫైనల్ మ్యాచ్ కు ప్రధాని మోడీని పిలిస్తే సరిపోలా? తన పేరు మీద ఉన్న స్టేడియంలో.. తానే ముఖ్య అతిధిగా హాజరై.. ప్రపంచకప్ విజేతకు కప్పు అందిస్తే బాగుంటుంది కదా? ఈ దిశగా బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తే బాగుంటుంది కదా? మోడీ మనసును మరింతగా దోచుకోవచ్చు కదా?
Tags:    

Similar News