ఐపీఎస్‌ కు అధికార పార్టీ ఎమ్మెల్యే వార్నింగ్‌

Update: 2017-05-08 09:53 GMT
ఫైర్‌ బ్రాండ్ సీఎం - ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప‌రిపాల‌న‌పై మ‌చ్చ లాంటి ఉదంతం ఇది. అధికార బీజేపీకి చెందిన‌ ఎమ్మెల్యే  ఇచ్చిన వార్నింగ్‌ తో మ‌హిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీస‌ర్ బిత్త‌ర‌పోయింది. అంద‌రి ముందూ తిట్ట‌డంతో క‌ల‌త చెందిన ఆమె కంట‌త‌డి పెట్టింది. ఈ ఘ‌ట‌న కోయిల్వా గ్రామంలో జరిగింది.

అక్ర‌మంగా మ‌ద్యం దుకాణాన్ని న‌డిపిస్తున్నారంటూ ఆ గ్రామంలో మ‌హిళ‌లు రాస్తారోకో నిర్వ‌హించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో లాఠీచార్జి కూడా జ‌రిగింది. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న స‌మ‌యంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాధామోహ‌న్ దాస్ అగ‌ర్వాల్ అక్క‌డికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఆఫీస‌ర్ చారు నిగ‌మ్‌ను ఆయ‌న తిట్టారు. ప‌దేప‌దే ఆమె వైపు వేలెత్తి చూపుతూ.. సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ``నేను నీతో మాట్లాడటం లేదు. నాకు ఏమీ చెప్పొద్దు. కామ్‌ గా ఉండు. నీ హ‌ద్దుల్లో నువ్వు ఉండు`` అంటూ ఆ ఎమ్మెల్యే హెచ్చ‌రించారు. తాను ఇక్క‌డ ఇన్‌ చార్జ్ కాద‌ని, ఏం చేస్తున్నానో త‌న‌కు తెలుస‌ని ఆమె బ‌దులిచ్చింది.

అదే స‌మ‌యంలో సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అక్క‌డికి చేరుకున్నారు. అప్ప‌టికే ఎమ్మెల్యే వార్నింగ్‌ తో చారు నిగ‌మ్ కంట‌త‌డి పెట్టుకుంది. దీనిని అక్క‌డున్న వాళ్లు మొబైల్ ఫోన్లో చిత్రీకరించి ఆన్‌ లైన్‌ లో పెట్టారు. అయితే తాను స‌ద‌రు అధికారితో త‌ప్పుగా ఏమీ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని ఎమ్మెల్యే రాధామోహ‌న్ దాస్ అన్నారు. మ‌ద్యం దుకాణాల‌కు వ్య‌తిరేకంగా శాంతియుతంగా ధ‌ర్నా చేస్తున్న‌వారితో పోలీసులే దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆయ‌న ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News