ప్ర‌చారం కోస‌మే ఫైర్‌ బ్రాండ్ ఐపీఎస్ ర‌చ్చ

Update: 2018-03-27 11:36 GMT
నిజాయితీ అధికారిగా పేరొందిన కర్ణాటక పోలీసు అధికారి డీ రూప.. భారీ నగదు పురస్కారాన్ని తిరస్కరించారు. అవినీతి కేసులో బెంగళూరులో జైలుశిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలిత సహచరురాలు వీకే శశికళకు జైలులో కల్పిస్తున్న ప్రత్యేక వసతుల గురించి బయటపెట్టిన ఐపీఎస్ అధికారి డీ రూపకు నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అవార్డుకు ఎంపికయ్యారని, ఈ అవార్డు కింద ఆమెకు భారీగా నగదు పురస్కారం అందజేస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు ప్రకటించగా తిర‌స్క‌రించార‌ని మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. కర్ణాటక సీనియర్ పోలీస్ అధికారి రూపా మౌడ్గిల్ తీరుపై తీవ్రంగా మండిపడింది నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ఎన్జీవో. అసలు ఆమెకు నమ్మ బెంగళూరు అవార్డు ఇస్తామని చెప్పనే లేదని ఆ సంస్థ స్పష్టంచేసింది. పైగా అవార్డు తనకు రావడం కోసం ఆమె చేసినంతగా గతంలో ఎవరూ లాబీయింగ్ చేయలేదని కూడా విమర్శించింది. ఈ మేరకు ఓ ఘాటు లేఖను ఆ ఎన్జీవో రిలీజ్ చేసింది.

`అవార్డుల్లో ప్రభుత్వ అధికారి కేటగిరీలో పోటీపడిన ఓ నామినీ తీరు మమ్మల్ని తీవ్రంగా బాధించింది. షాక్‌ కు గురిచేసింది. గతంలో ఎవరూ అవార్డు కోసం ఇంతలా లాబీయింగ్ చేయలేదు. అవార్డు తనకు రాకపోయినా.. నేనే నిరాకరించాను అన్న బాధ్యతారహిత వ్యాఖ్యలు మరీ దారుణం` అని నమ్మ బెంగళూరు ఫౌండేషన్ తీవ్రంగా స్పందించింది. అయితే లేఖలో ఎక్కడా రూపా పేరును మాత్రం ప్రస్తావించలేదు. `ఎంతో లాబీయింగ్ చేసినా అవార్డు రాలేదన్న కారణంతో ఆమె ఇలా మాట్లాడి ఉండొచ్చు.. కానీ ఈ విషయంలో ఆమెకు మేము ఒక్కటే చెప్పదలచుకున్నాం.. నామినీలంతా విన్నర్లే` అని ఆ సంస్థ స్పష్టంచేసింది. అవార్డుతోపాటు భారీ నగదు ఇస్తుండటం వల్ల దీనిని నిరాకరించినట్లు రూపా రెండు రోజుల కిందట చెప్పారు.

రూప ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్ ఇన్‌ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీపీ)గా పని చేస్తున్నారు. భారీమొత్తంలో నగదు అవార్డు తీసుకునేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని పేర్కొంటూ రూప సోమవారం నమ్మ ఫౌండేషన్‌కు లేఖ రాశారు. ఈ ఫౌండేషన్‌ కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ నిధులు సమకూరుస్తున్న నేపథ్యంలో తన వైఖరిని రూప వెల్లడించారు. ప్రతి ప్రభుత్వోద్యోగి రాజకీయ సంస్థల పట్ల సమాన దూరం పాటించాలి. తటస్థ వైఖరి ప్రదర్శించాలి. నిజాయితీగా ఉండాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Tags:    

Similar News