ఐఏఎస్ క‌ల కోసం అడ్డ‌దారి తొక్కిన ఏఎస్పీ

Update: 2017-10-31 06:12 GMT
ఆశ ఉండ‌టం త‌ప్పేం కాదు.  కానీ.. దాన్ని తీర్చుకోవ‌టం కోసం అడ్డ‌దారిలో న‌డ‌వ‌ట‌మే త‌ప్పు. అలాంటి ప‌నే చేసి అడ్డంగా బుక్ అయిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఒక ఐపీఎస్ అధికారి ఐఏఎస్ కావాల‌న్న ఆశ.. అత‌ను.. అత‌ని భార్య.. మ‌రొక‌రు అరెస్ట్ అయ్యే వ‌ర‌కు వెళ్లింది. సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతం చూస్తే.. క‌ల‌ను తీర్చుకోవ‌టానికి ఏం చేయ‌కూడ‌ద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది.

త‌మిళ‌నాడులోని తిరున‌ల్వేలి జిల్లా ఏఎస్పీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న ఐపీఎస్ అధికారి క‌రీంకు ఐఏఎస్ కావాల‌న్న‌ది క‌ల‌. ఇది తీర్చుకోవ‌టానికి ఊహించ‌ని రీతిలో భారీ త‌ప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. తాజాగా నిర్వ‌హిస్తున్న యూపీఎస్సీ ప‌రీక్ష‌లో బ్లూటూత్ సాయంతో ప‌రీక్ష రాస్తూ.. హైద‌రాబాద్ లో ఉన్న త‌న భార్య సాయంతో  స‌మాధానాలు రాస్తూ దొరికిపోయాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు.. ఆయ‌నిచ్చిన స‌మాచారంతో హైద‌రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు క‌రీమ్ భార్య జాయిస్ ను.. వారికి స‌హ‌క‌రించిన ఐఏఎస్ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ రాంబాబును సోమ‌వారం రాత్రి అరెస్ట్ చేశారు.

అస‌లేం జ‌రిగింద‌న్న‌ది చూస్తే.. ఐపీఎస్ గా ఉన్న‌ప్ప‌టికీ  క‌రీమ్‌కు ఐఏఎస్ కావాల‌న్న‌ది తీర‌ని కోరిక‌. దాన్ని తీర్చుకోవ‌టానికి యూపీఎస్పీ నిర్వ‌హించే అర్హ‌త ప‌రీక్ష రాసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే.. కోరుకున్న‌ ర్యాంకు రాక‌పోతే ఎలా? అన్న సందేహంతో అడ్డ‌దారి తొక్కేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక‌త గురించి ఆరా తీశాడు.

డార్క్ సైట్ల‌లో స‌మాచారాన్ని సేక‌రించిన క‌రీం ఒక ప‌క్కా ప్లాన్ సిద్ధం చేశాడు. ఛాతీకి స‌మీపంలో అమ‌ర్చుకునే వెబ్ ఆధారిత మైక్రో కెమెరా.. ఫోన్ తో కూడిన ప‌రిక‌రాన్ని తెప్పించాడు. దాన్ని అమ‌ర్చుకొని ప‌రీక్ష గ‌దిలోకి వెళ్లి ప్ర‌శ్నా ప‌త్రాన్ని మెక్రో కెమెరాతో చూపిస్తే.. అది కాస్తా రికార్డు అయి గూగుల్ డ్రైవ్‌కు పంపుతుంది. ప‌రీక్షహాల్ బ‌య‌ట ఉన్న వారు.. గూగుల్ డ్రైవ్‌ను ఓపెన్ చేసి.. ప్ర‌శ్నాప‌త్రాన్ని చూసి.. మైక్రోఫోన్ తో స‌మాధానాలు చెబుతారు. ఒక‌వేళ‌.. వారు చెప్పిన స‌మాధానం స‌రిగా వినిపించ‌కుంటే.. మీ స‌మాధానం స‌రిగా వినిపించ‌టం లేద‌న్న మాట‌ను పేప‌ర్ మీద రాసి కెమెరా సాయంతో పంపుతాడు. స‌మాధానాన్ని గట్టిగా చెప్ప‌టం ద్వారా అనుకున్న‌వ‌న్నీ స‌రిగా రాయ‌టానికి సాయం చేస్తాయి.

ఈ విధానాన్ని తొలుత త‌న సోద‌రి మీద విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన క‌రీం..  ప్రిలిమ్స్ లో తాను అనుకున్న‌ట్లే ఈ సాంకేతిక‌తో చ‌క్క‌టి ఫ‌లితాన్ని పొందాడు. తాజాగా మెయిన్స్ ఎగ్జామ్ లోనూ ఇదే విధానాన్ని అమ‌లు చేశాడు. మ‌రి.. వారి ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానాలు చెప్పేందుకు వీలుగా హైద‌రాబాద్ కు చెందిన ఐఏఎస్ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ రాంబాబు సాయం చేశాడు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు క‌రీం మోసం గురించి తెలుసుకొని త‌నిఖీలు నిర్వ‌హించారు. మైక్రో కెమెరా.. ఫోన్ లాంటి ప‌రిక‌రాల్ని స్వాధీనం చేసుకొని అత‌న్ని అరెస్ట్ చేశారు. ఆపై వివ‌రాల‌న్నీ తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది హైద‌రాబాద్ పోలీసుల్ని అలెర్ట్ చేశారు. క‌రీం ఇచ్చిన స‌మాచారంతో ఆయ‌న భార్య జాయిస్ ను వారికి స‌హ‌క‌రించిన రాంబాబును అరెస్ట్ చేశారు. ఐపీఎస్ అయిన‌ప్ప‌టికీ అది స‌రిపోద‌న్న‌ట్లుగా ఐఏఎస్ క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌టానికి ఈస్థాయిలో ప్లాన్ వేసిన తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. క‌రీం సాధించిన ఐపీఎస్ కూడా ఇదే రీతిలో చేశాడా? అన్న సందేహాలు త‌లెత్తుతున్నాయి.
Tags:    

Similar News