ఆ ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఐపీఎస్ అధికారి

Update: 2020-02-10 11:40 GMT
ఎంత అత్యుత్తమ స్థానంలో ఉన్నా.. వారికంటూ కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. అలాంటి వాటిని పరిష్కరించుకునే క్రమంలో రోడ్ల మీదకు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కర్ణాటకకు చెందిన ఒక ఐపీఎస్ అధికారి. కన్నబిడ్డల్ని చూసుకునేందుకు రోడ్డు మీద ధర్నాకు దిగిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది.

బెంగళూరులోని కాలబురగిలో పోలీసు అంతర్గత భద్రతా విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా వ్యవహరిస్తున్నారు ఐపీఎస్ అధికారి అరుణ్ రంగరాజన్. ఆయన మాజీ భార్య కూడా డీసీపీ స్థాయి అధికారిణినే. వీరిద్దరూ ఛత్తీస్ గఢ్ లో పని చేస్తున్న వేళ పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్నారు. విభేదాలతో వారు విడిపోయారు. వీరికి 2015లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

తన ఇద్దరు పిల్లల్ని చూసుకునేందుకు అరుణ్ రంగరాజన్ ఆదివారం సాయంత్రం బెంగళూరులోని తన మాజీ భార్య ఇంటికి వచ్చారు. అయితే... రంగరాజన్ ను ఆమె ఇంట్లోకి రానివ్వలేదు. తన పిల్లల్ని చూసే వరకూ తాను ఇంటి ముందు నుంచి కదలనంటూ భీష్మించుకున్నారు. దీంతో.. ఆమె పోలీసులకు ఫోన్ చేసి.. తన మాజీ భర్త తనను వేధిస్తున్నట్లుగా కంప్లైంట్ ఇచ్చారు.

ఒక్కప్పటి భార్యభర్తలు ఇద్దరూ పోలీసు అధికారులే కావటంతో పోలీసులు కూడా పెద్దగా జోక్యం చేసుకోకుండా.. వారిద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారి నుంచి సానుకూలత లేకపోవటంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. తన పిల్లల్ని చూపించిన తర్వాత మాత్రమే తాను ఇంటి ముందు నుంచి కదులుతానని చెప్పి అక్కడే ఉండిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
    

Tags:    

Similar News