స‌హాయం కోసం ఆర్డ‌ర్ వేయ‌డమేంది బాబు?

Update: 2015-11-10 05:38 GMT
సాధారణంగా స‌హాయం చేయ‌డం  అంటే అది ఆ వ్య‌క్తి వీలును బ‌ట్టి ఉంటుంది. వీలు అంటే ఆ వ్య‌క్తికి గ‌ల ఆర్థిక స్థోమ‌త‌ - శ‌క్తియుక్తులు ఇత‌రాల‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ ఇలాంటి వితరణకు సమయం, ప్రత్యేకించి ఫలానా ర‌కంగానే ఇవ్వాలని ఎవరూ అడగరు. కానీ ఘ‌న‌త వ‌హించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అధికారులు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఆఘమేఘాల మీద ఆర్డ‌ర్ పాస్ చేశారు.

అమరావతి రాజధాని నిర్మాణంలో ప్ర‌జ‌లు స్వచ్ఛందంగా భాగ‌స్వామ్యం అయ్యేందుకు మై బ్రిక్‌-మై అమ‌రావ‌తి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద ఎవ‌రైనా త‌మ ఆస‌క్తి, స్థాయి మేర‌కు స‌హాయం చేయ‌వ‌చ్చు. కానీ ఏపీ జలవనరుల శాఖ ఉద్యోగులు తప్పనిసరిగా ఇటుకలు వితరణగా ఇవ్వాలని ఆ శాఖ ఉద్యోగుల అధిప‌తి ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌ సీ) సర్క్యులర్‌ జారీ చేశారు. ఇటుకలు వితరణ ఇచ్చేందుకు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు సమయం కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని జల వనరులశాఖ ఉద్యోగులు 3,474 మంది 1.32 లక్షల ఇటుకలు రాజధాని నిర్మాణానికి ఇవ్వాల్సి ఉంది. కేటగిరీల వారీగా ఈఎన్‌ సి - ఎస్ ఈ - ఈఇ కేటగిరీల వారు వెయ్యి ఇటుకల వంతున, ఈఈలు 750 ఇటుకలు - డీఈ క్యాడర్‌ వారు 500 ఇటుకలు - ఏఈ క్యాడర్‌ 300 ఇటుకల వంతున ఇవ్వాలని సర్క్యులర్‌ లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వివరణ విలువ రూ. 1.32 కోట్లుగా జల వనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

రాజధాని నిర్మాణానికి ఇప్పటికే ఒక రోజు జీతాన్ని ప్రభుత్వం కట్‌ చేస్తుండగా, అదనంగా ఇటుకల భారమేమిటని పలువురు ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. స‌హాయం కోసం సర్క్యులర్‌ విడుదల చేయడం ఏంట‌ని వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News