అమ‌రావ‌తి జ‌గ‌న్ ప్రయార్టీ లిస్ట్ లో లేదా?

Update: 2019-06-01 10:13 GMT
ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసి.. బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌గ‌న్ త‌న తొలి రోజునే త‌న ప్రాధాన్య‌త అంశాలు ఏమిట‌న్న విష‌యాన్ని అధికారుల‌కు చెప్ప‌క‌నే చెప్పేశారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని అప్పులు తెచ్చి మ‌రీ యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మించాల్సిన అవ‌స‌రం లేద‌న్న వ్యాఖ్య జ‌గ‌న్ నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.

అమ‌రావ‌తికి సంబంధించి ఇప్ప‌టికే స‌చివాల‌యంతో పాటు ముఖ్య‌మైన భ‌వ‌నాలు ఉన్నాయి. అవ‌న్నీ ప‌ర్మినెంట్ కాకున్నా.. తాత్కాలికంగా వాటితో బండి న‌డిపించాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉండ‌టం.. జీతాల‌కు సైతం ఓవ‌ర్ డ్రాప్ట్ ను ఆశ్ర‌యించే దుస్థితిలో ఉన్న వేళ‌.. ఇప్పుడు శాశ్విత నిర్మాణాల కోసం వేలాది కోట్లు ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న తాత్కాలిక భ‌వ‌నాల‌తో బండి న‌డిపించేయ‌టం.. శాశ్విత భ‌వ‌నాల కోసం పెట్టే ఖ‌ర్చును ప్ర‌స్తుతానికి నిలిపివేయాల‌న్న మాట‌ను సీఆర్డీ అధికారుల భేటీ సంద‌ర్భంగా జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తాను ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన న‌వ‌ర‌త్నాల‌కు భారీ ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని.. అందుకు అవ‌స‌ర‌మైన నిధుల కొర‌త ఉన్న నేప‌థ్యంలో అమ‌రావ‌తి నిర్మాణాన్నికాస్త వాయిదా వేయాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

శాశ్విత నిర్మాణాల‌కు పెద్ద ఎత్తున ఖ‌ర్చు పెట్టే క‌న్నా.. ఉద్యోగుల నివాస ప్రాంతాల‌ను నిర్మించే అంశం మీద జ‌గ‌న్ ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చే అవ‌కాశం ఉందంటున్నారు. వాటితో పాటు.. అసెంబ్లీ స‌భ్యుల నివాసిత కాంప్లెక్స్ ల నిర్మాణం మీద కూడా జ‌గ‌న్ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదంతా చూసిన‌ప్పుడు జ‌గ‌న్‌కు అమ‌రావ‌తి ప్ర‌యారిటీ లిస్ట్ లో లేద‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.


Tags:    

Similar News