బీజేపీ ఫార్ములా... జగన్ కి బిగ్ రిస్క్ సుమా...?

Update: 2022-12-09 01:30 GMT
బీజేపీ డేరింగ్ అండ్ డేరింగ్ గా అనేక నిర్ణయాలు తీసుకుంది. గుజరాత్ లో ఎన్నికలు ఏడాది మాత్రమే ఉన్న వేళ ఏకంగా విజయ్ రూపానిని ముఖ్యమంత్రి గద్దె మీద నుంచి దించడం అంటే దుస్సాహసమే. అంతే కాదు ఆయన మంత్రులలో చాలా మందికి పదవులు ఇవ్వలేదు. ఆ తరువాత టికెట్లు ఇవ్వలేదు.

అంతే కాదు ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వలేదు, వీరిలో మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలిస్తే సగానికి సగం  మందికి  నో చెప్పింది అంటే డేరింగ్ స్టెప్ అది. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది. ఉద్యమిస్తున్న పటేల్స్ ని మంచి చేసుకుని వారి సామాజిక వర్గానికే చెందిన భూపేంద్రపటేల్ ని సీఎం గా చేసింది.

ఇంకో వైపు విపక్షం వీక్ అయిందని, గెలవలేదని మైండ్ గేం కూడా చేసింది. కాంగ్రెస్ తమకు అసలు పోటీయే కాదని కూడా తీసి పడేసింది. బూత్ లెవెల్ వరకూ కూడా క్యాడర్ ని పెట్టి ఎన్నికల గోదాలోకి దిగింది. ఎన్నికల ముందే ప్రతిపక్షాలను డీ మోరలైజ్ చేసి అసలైన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. ఇపుడు ఏపీలో వైసీపీ కూడా దాన్ని జాగ్రత్తగా గమనిస్తోందిట.

ఆరు సార్లు విజయం, మూడు దశాబ్దాలుగా కుర్చీకే అతుక్కుపోయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు గెలుస్తున్నారు అంటే దాని వెనక బీజేపీ వ్యూహాలు ఉన్నాయి. మరి నిర్దాక్షిణ్యంగా వాటిని అమలు చేయగలడం వైసీపీకి సాధ్యమేనా అన్నదే చర్చగా ఉంది. వైసీపీలో కూడా సగానికి సగం మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వారిని తప్పిస్తే ఫ్రెష్ లుక్ వస్తుంది. కొత్త వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా విజయం సాధించాలన్న బీజేపీ ఫార్ములాను వైసీపీ ఇక్కడ అమలు చేయగలదా అన్నది ప్రశ్న.

ఇక బీసీలకు వంద సీట్లలో బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇంచుమించు అన్నే సీట్లు ఉన్న ఏపీలో కూడా వైసీపీ ఈసారి వంద సీట్లు బీసీలకు ఇవ్వగలదా. ప్రత్యేకించి రాయలసీమలో ఒక బలమైన సామాజికవర్గాన్ని కాదని వారికి టికెట్లు ఇస్తారా ఇది ఒక చర్చ. మంత్రులను పనిచేయని వారిని ముందే తప్పించి సర్కార్ కి క్లీన్ ఇమేజ్ తెచ్చుకుంది బీజేపీ ఏపీలో చాలా మంది కొత్త మంత్రుల పనితీరు మీద విమర్శలు ఉన్నాయి.

ఇదే టీం తో ఎన్నికలకు వెళ్తే ఇబ్బందులు తప్పవని అంతా అంటున్నారు. కానీ ఇది ఎన్నికల టీం అని వైసీపీ పెద్దలు నమ్ముతున్నారు. మంత్రిగా పనిచేయని వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా. ఒకవేళ ఆ టికెట్ నిరాకరిస్తే వారు మంత్రులుగా పనిచేయనట్లే కదా. మరి ఆ యాక్షన్ ఏదో ముందే తీసుకునే ఆలోచన వైసీపీ హై కమాండ్ కి ఉందా. అదే విధంగా ఏపీలో బలమైన కాపు సామాజికవర్గానికి భరోసా కల్పించే ప్రయత్నం వైసీపీ చేయగలదా.

ఇలా బీజేపీ గుజరాత్ ఫార్ములాలో చాలా అంశాలు ఉన్నాయి. వాటిని కనుక సక్రమంగా వైసీపీ అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుంది అని అంటున్నారు. కానీ అలా చేసిన బీజేపీ ఒక జాతీయ పార్టీ. కేంద్రంలో అధికారంలో  ఉంది. అన్ని రకాలుగా పవర్ ఫుల్. కానీ ఒక ప్రాంతీయ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున సంస్కరణలు చేయడం అంటే బహు కష్టం. కానీ వైసీపీ చేయాలని చూస్తే మాత్రం చాలా రిస్క్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న వార్నింగ్ బెల్స్ కూడా పక్కనే ఉన్నాయి. మొత్తానికి బీజేపీ సక్సెస్ ఫార్ములా వైసీపీనే కాదు, చాలా పార్టీలు అమలు చేయడానికి కష్టమే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News