కేంద్రప్రభుత్వమే తప్పుచేసిందా?

Update: 2022-06-18 09:30 GMT
క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఆర్మీ రిక్రూట్మెంట్ లో కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఆగ్నిపథ్ అనే పథకాన్ని ప్రకటించింది. దీనిప్రకారం అగ్నిపథ్ లో చేరిన వారిలో 75 శాతం మందిని నాలుగు సంవత్సరాలు కాగానే రిటైర్ చేసేస్తుంది. పనితీరు సంతృప్తికరంగా ఉన్నవారికి  మాత్రమే సర్వీసు పొడిగిస్తుంది. ఈ పథకంలో చేరిన వారికి జీతం తప్ప ఎలాంటి బత్యం ఉండదు. పెన్షన్ రాదు, ఆరోగ్య బీమా లాంటి ఏ ప్రయోజనాలు ఉండవు.

అంటే సింపుల్ గా చెప్పాలంటే నాలుగేళ్ళు పని చేయించుకుని ఇవ్వాల్సిందిచ్చి పంపేస్తారు. ఇక్కడే సమస్య మొదలైంది. అదేమిటంటే ఆర్మీలో చేరాలని అనుకునేవారు దీర్ఘకాలం ఉండాలని అనుకుంటారు కానీ ఏదో నాలుగేళ్ళు పనిచేసి రిటైర్ అయిపోవాలని అనుకోరు. ఇదే సమయంలో రెండేళ్ల క్రితమే ఆర్మీ రిక్రూట్మెంట్ రాత పరీక్ష రాసి, మెడికల్ టెస్ట్ పాసై, ఫైనల్ పరీక్ష కోసం లక్షలాది మంది అభ్యర్ధులు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేంద్రం అగ్నిపథ్ అంటు కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇప్పటికే పరీక్షలు రాసి క్వాలిఫై అయిన లక్షలాదిమంది అభ్యర్ధుల్లో అయోమయం మొదలైపోయింది.

దానికి తోడు ఈ అభ్యర్ధులను కూడా అగ్నిపథ్ లోనే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలన్నట్లుగా రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పటంతో అభ్యర్థులందరికీ మండిపోయింది. అలాకాకుండా ఇప్పటికే పరీక్షలు రాసిన లక్షలాది మంది అభ్యర్ధులను రెగ్యులర్ గానే ఎంపిక చేసుంటే బాగుండేది.

కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ను వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నట్లు చెప్పుంటే బాగుండేది. లేదా అగ్నిపధ్ పథకంలోనే ఇప్పటికే పరీక్షలు రాసిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పున్నా ఒకలాగుండేది. కానీ లక్షలాదిమంది అభ్యర్ధుల భవిష్యత్తును పట్టించుకోకుండా మొండిగా పథకాన్ని ప్రకటించటంతోనే అభ్యర్ధులంతా రెచ్చిపోయారు. బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్రలో లక్షలాది మంది అభ్యర్ధులు రైల్వేస్టేషన్లపైన పడ్డారు.

 అలాగని ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టి, ధ్వంసం చేయడాన్ని ఎవరు సమర్ధించటం లేదు. కానీ వీళ్ళల్లో ఇంత ఆగ్రహం కట్టలు తెచ్చుకోవటానికి కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే కారణమని అనుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం విజ్ఞతతో వ్యవహరిస్తే గొడవలు కంట్రోల్ అవుతాయి లేకపోతే సమస్య చేయిదాటి పోయేట్లుంది.
Tags:    

Similar News