చంద్రబాబు వైశ్రాయ్ రాజకీయాలు పనిచేయ లేదా ?

Update: 2021-03-15 11:00 GMT
రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబునాయుడు అవుట్ డేటెడ్ అయిపోయారా ? తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 1995లో ఎన్టీయార్ ను పదవిలోనుండి దింపేసేందుకు ప్లాన్ చేశారు. అందుకు లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి కొంతమంది ఎంఎల్ఏలను అడ్డుపెట్టుకుని నాటకం ఆడారు. మొదట్లో చంద్రబాబు దగ్గర ఎంఎల్ఏలు లేకపోయినా ఉన్నట్లు తన మీడియాతో వార్తలు రాయించి సక్సెస్ అయ్యారు.

అప్పట్లో అంటే తనిష్టం వచ్చినట్లు వార్తలు రాయించి సక్సెస్ అయ్యారు. ఎలా సక్సెస్ అయ్యారంటే అప్పట్లో మీడియా ఏమి చెబితే అదే జనాలు నమ్మేవారు. అయితే కాలంతో పాటు చంద్రబాబు అప్ డేట్ అవ్వలేదు. అప్పట్లో అంటే 1995లో తాను ఏమి అనుకుంటే అది చేయగలిగిన చంద్రబాబు ఇపుడు కూడా అంటే 2019లో కూడా అదే ఫార్ములా వాడుతున్నారు. ఇది 1995 కాదని, 2019 అన్న విషయాన్ని మరచిపోయారు. ఇక్కడే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫెయిలయ్యారు.

1995లో కేవలం మీడియా మాత్రమే ఉండేది. కానీ ఇపుడు మీడియాను మించి సోషల్ మీడియా దుమ్మురేపేస్తోంది. మీడియాలో కనిపించని యాంగిల్, మీడియా చూపించని తెరవెనుక వ్యవహారాలను కూడా సోషల్ మీడియా జనాలముందు ఉంచుతోంది. దాంతో ప్రతి విషయం మీద జనాలకు పూర్తి సమాచారం అందుతోంది. కాబట్టి జనాలకు ఎవరేమిటో అర్ధమైపోతోంది.

ఈ విషయాన్ని మరచిపోయిన చంద్రబాబు ఇంకా అప్ డేట్ కాకపోవటంతో జగన్మోహన్ రెడ్డి ముందు ఫెయిలవుతున్నారు. మొదటి దెబ్బ 2019 సాధారణ ఎన్నికల్లో పడింది. అయినా చంద్రబాబు మేల్కోలేదు. అప్ డేట్ కాకపోవటంతో పంచాయితి ఎన్నికలు, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా వరసుగా చంద్రబాబుకు ఎదురు దెబ్బలు తప్పలేదు. కష్టమో నష్టమో జగన్ నేరుగా ప్రజలతో తాను చెప్పదలచుకున్నది చెప్పేస్తున్నారు.

అయితే చంద్రబాబు ఇంకా బురదచల్లుడు రాజకీయాల్లోనే ముణిగి తేలుతున్నారు. చెప్పేదొకటి చేసేదొకటిగా వ్యవహరిస్తున్నారు. జనాల్లో కాదు ముందు పార్టీ నేతలు, క్యాడర్లో కూడా నమ్మకం పోగొట్టుకున్నారు. దీని ఫలితమే వరుసగా రెండు భారీ పరాజయాలు. చంద్రబాబు అప్ డేట్ కానంతవరకు ఎవరు ఏమీ చేయగలిగేదేమీ లేదు.


Tags:    

Similar News