కాంగ్రెస్ పున‌ర్నిర్మాణం జ‌రుగుతోందా?

Update: 2021-07-02 14:30 GMT
రెండు ద‌ఫాలుగా కాంగ్రెస్ ఓడిపోవ‌డం.. సీనియ‌ర్లుగా ఉన్న‌వారంతా పార్టీని బాగుచేయ‌డానికి కాకుండా.. భారంగా మారిపోయార‌నే అభిప్రాయం ఆ పార్టీ కేడ‌రే బ‌హిరంగంగా వ్యాఖ్యానిస్తోంది. వాస్త‌వానికి కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంది. దేశంలో జీ-32 పేరుతో ఏర్ప‌డిన కాంగ్రెస్‌ సీనియ‌ర్లంతా అధిష్టానం మీద అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అదికూడా.. దేశంలో కీల‌క‌మైన ఎన్నిక‌లు వ‌చ్చిన వేళ ఓ మీటింగు పెట్టుకొని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌ను తిట్టాల్సిన కాడికి తిట్టేసి, ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోతున్నారు. మ‌రి, వీళ్లు కాంగ్రెస్ కోసం ప‌నిచేస్తున్నారా? ఇందులో ఉండి ప్ర‌త్య‌ర్థుల గెలుపుకోసం ప‌నిచేస్తున్నారా? అనే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. రాహుల్ గాంధీ దేశ‌వ్యాప్తంగా యూత్ టీమ్ ను త‌యారు చేసుకోవాల‌ని చూస్తున్నార‌నే ప్ర‌చారం ఆ మ‌ధ్య సాగింది. ప్ర‌తీ రాష్ట్రంలోనూ టాలెంట్ ఉన్న యంగ్ లీడ‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని చూస్తున్నార‌ని, ఇందుకోసం జాబితాను కూడా సిద్ధం చేస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు టీపీసీసీ కూర్పును చూస్తే అది వాస్త‌మేన‌నే అభిప్రాయం క‌లుగుతోంద‌ని అంటున్నారు.

తాజాగా ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని ప్ర‌క‌టించ‌డం అందులో భాగ‌మేన‌ని అంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌కుండా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియ‌ర్లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో అన్నీ చేశారు. కొంద‌రు కాంగ్రెస్ సీనియ‌ర్లు రేవంత్ రెడ్డిని జూనియ‌ర్ గా చెప్ప‌డంతోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన‌వాడ‌ని, అలాంటి రేవంత్ కు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు.. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష‌ ప‌ద‌వి ఇస్తే మాత్రం.. తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామ‌ని అన్న‌ట్టుగా లీకులు కూడా ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అధిష్టానం సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌క్క‌కు నెట్టేసింది. వాళ్ల అభ్యంత‌రాల‌ను లైట్ తీసుకుంది. రేవంత్ రెడ్డికే తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అంతేకాదు.. అవ‌స‌రం అనుకున్న సీనియ‌ర్లను మాత్ర‌మే క‌మిటీలోకి తీసుకుంది. ఉప‌యోగం లేదు అనుకున్న నేత‌లు ఎంత‌టి సీనియ‌ర్లు అయినా.. ప‌క్క‌న పెట్టేసింది. ఈ విష‌యం క‌మిటీ జాబితాను చూస్తేనే అర్థ‌మైపోతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్ర రాజ‌కీయాల్లో వ‌రంగ‌ల్ పాత్ర ఏ పాటిదో అంద‌రికీ తెలిసిందే. తెలంగాణ ఉద్య‌మంతోపాటు సుదీర్ఘ‌ రాజ‌కీయ చ‌రిత్ర‌ను ప‌రిశీలించినా.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ పాత్ర అమోఘ‌మైన‌ది. ఈ జిల్లాలో కాంగ్రెస్ త‌ర‌పున ఎంద‌రో సీనియ‌ర్లు ఉన్నారు. కానీ.. తాజా తెలంగాణ పీసీసీలో ఇక్క‌డి నేత‌ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పీసీసీ చీఫ్ గా ప‌నిచేసిన పొన్నాల క్ష్మ‌య్య నుంచి మాజీ కేంద్ర మంత్రి బ‌ల‌రాం నాయ‌క్‌, మాజీ మంత్రి కొండా సురేఖ‌, ఆమె భ‌ర్త కొండా ముర‌ళి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి వంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యే సీత‌క్క‌, కొండా సురేఖ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఆశించారు కూడా. మిగిలిన వారు ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ.. మొత్తం ఆరు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి వేం న‌రేంద‌ర్ రెడ్డికి మాత్ర‌మే పీసీసీలో చోటు ద‌క్కింది. మిగిలిన వాళ్లంద‌రినీ లైట్ తీసుకుంది అధిష్టానం. ఇదంతా చూసిన‌ప్పుడు.. రాహుల్ టీమ్ సిద్ధమవుతోందా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మ‌రికొంత కాలం ప‌డుతుంది.
Tags:    

Similar News