భార్య మాట విని ఈ సీనియర్ టీ కాంగ్రెస్ నేత బీజేపీలోకి చేరతారా?

Update: 2021-03-09 04:30 GMT
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేతలంతా టీఆర్ఎస్ పాలనలో అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దామోదర రాజనర్సింహా విషయాన్నే తీసుకుంటే.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన పెద్దగా కనిపించకుండా పోయారు. 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఆయన కుటుంబ సభ్యుల నిర్ణయం హాట్ టాపిక్ గా మారి.. వార్తల్లోకి కనిపించారు. ఆ తర్వాత ఆయన పేరు పెద్దగా కనిపించలేదు.. వినిపించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన సతీమణి.. కుమార్తెలు ఇద్దరు దామోదరను బీజేపీలోకి చేరాలని ఒత్తిడి పెడుతున్నట్లుగా చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయటానికి సిద్ధమయ్యారు దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని. అప్పట్లో ఆ స్థానాన్ని జగ్గారెడ్డికి కాంగ్రెస్ కేటాయించటంతో అసంతృప్తికి లోనయ్యారు. 2018లో ఆమె అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. కానీ.. భర్త ఒత్తిడితో సాయంత్రానికి మళ్లీ కాంగ్రెస్ లో వచ్చేయటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దామోదరను బీజేపీలోకి చేరాలంటూ కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరిగినట్లుగా తెలుస్తోంది.

దామోదర రాజనర్సింహా కనుక బీజేపీలోకి వస్తానంటే.. ఆయనకు ఘనస్వాగతం పలుకుతామని.. ఢిల్లీలోని పార్టీ పెద్దలతో పార్టీ కండువా కప్పించి.. సాదరంగా ఆహ్వానిస్తామని చెబుతున్నారు. ఇప్పటివరకు దామోదర రాజనర్సింహా ఆందోళ్ నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు పోటీ చేసిన ఆయన మూడుసార్లు మాత్రమే నెగ్గారు. కాకుంటే.. ఉమ్మడి రాష్ట్రంలోని దివంగత వైఎస్ తోనూ.. తర్వాత సీఎంలు అయిన రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డిలతో ఆయన సన్నిహితంగా వ్యవహరించేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆయన ప్రభ మసకబారింది. దీంతో.. ఆయన పేరు పెద్దగా వినిపించని పరిస్థితి. తాజాగా కుటుంబ సభ్యుల పుణ్యమా అని మళ్లీ ఆయన పార్టీ మారే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది. మరి.. ఈసారి ఏమవుతుందో చూడాలి.
Tags:    

Similar News