ఆ కాంగ్రెస్ మాజీ నేత కొత్త పార్టీ పెట్టనున్నారా?

Update: 2022-08-26 11:01 GMT
కాంగ్రెస్ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ కేంద్ర మంత్రి గులాం న‌బీ ఆజాద్ కొత్త పార్టీ పెడ‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్ల అనుబంధాన్ని గులాం న‌బీ ఆజాద్ తెంచుకున్న విష‌యం తెలిసిందే. జ‌మ్ముకాశ్మీర్ కాంగ్రెస్ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వికి కూడా ఆయ‌న రాజీనామా చేశారు.

కొత్త పార్టీని ఏర్పాటు చేసి జ‌మ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గులాం న‌బీ ఆజాద్ పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొన్న‌ట్టు జాతీయ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది. నేను జ‌మ్ముక‌శ్మీర్ వెళ్లానున‌.. ఆ రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెడ‌తాను.. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తాను అని ఆజాద్ పేర్కొన్న‌ట్టు మీడియా తెలిపింది.
ఈ ఏడాది రెండో సగంలో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో జమ్ముక‌శ్మీర్‌కే చెందిన గులాం న‌బీ ఆజాద్ త‌న ఉనికిని గ‌ట్టిగా చాటుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఈ ఏడాది మొద‌ట్లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆయ‌న ప‌ద‌వీకాలం పూర్త‌యింది. గ‌త 50 ఏళ్ల నుంచి ఆయ‌న ఏ ప‌దవిలో లేకుండా లేరు. జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా గులాం న‌బీ ఆజాద్ ప‌నిచేశారు.

2000 ద‌శ‌కంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌హారాల కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఆజాద్ చ‌క్రం తిప్పారు. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఇటు తెలంగాణ రాజ‌కీయాలు, పార్టీలు, నేత‌ల‌పై ఆయ‌న‌కు సంపూర్ణ అవ‌గాహ‌న ఉంది. జ‌మ్ముకాశ్మీర్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌ను ఆ రాష్ట్ర ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌గా నియ‌మించింది.

అయితే ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న సిఫార‌సుల‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపిస్తూ ఆయ‌న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

మ‌రోవైపు గులాం న‌బీ ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది. బీజేపీపై అనేక అంశాల్లో పోరాటం చేస్తున్న కీల‌క త‌రుణంలో రాజీనామా చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌ల్లో ఒక‌రైన జైరామ్ ర‌మేష్ మీడియాతో మాట్లాడుతూ గులాం న‌బీ ఆజాద్ చేసింది స‌రైన ప‌ని కాద‌న్నారు.
Tags:    

Similar News