'ఇప్ప‌టం' పొలిటిక‌ల్ ఇష్యూనా? డెవ‌ల‌ప్‌మెంట్ ఇష్యూనా?

Update: 2022-11-05 08:30 GMT
మంగ‌ళ‌గిరి మండ‌లం ఇప్ప‌టం గ్రామంలో ఏం జ‌రుగుతోంది?  అస‌లు ఇక్క‌డ ఎందుకు ఇంత ఉద్రిక్త‌త చోటు చేసుకుంది? ఇదీ ఇప్పుడు అత్యంత ఆస‌క్తిగా మారిన విష‌యం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ గ్రామంలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియని ఒక గ్రామం ఇప్పుడు ప‌త్రిక‌ల ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కింది. స్థానికంగా ఉన్న ఒక‌రిద్ద‌రు చెబుతున్న విష‌యం ఏంటంటే.. ఇప్ప‌టం గ్రామాన్ని అభివృద్ధి చేయాల‌నేది స్థానిక ఎమ్మెల్యే గ‌తంలోనే త‌మ‌కు చెప్పార‌ని అంటున్నారు.

ముఖ్యంగా ర‌హ‌దారులు.. లైటింగ్ వంటి ప్ర‌తిపాద‌న ఎప్ప‌టి నుంచో ఉంద‌ని అంటున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నా ర‌ని.. అయితే, అప్ప‌ట్లో ప్లాన్ రెడీ అవ‌క‌ముందే ఎన్నిక‌లు రావ‌డంతో దీనిని విర‌మించుకున్నార‌ని చెబుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ ప‌నులు చేయాల‌ని తామే స్వ‌యంగా ఎమ్మెల్యే స‌హా ఎంపీ(టీడీపీ)ల‌కు విన్న‌వించుకున్నామ‌ని , అయితే క‌రోనా కార‌ణంగా ప‌నులు ముందుకు సాగ‌లేద‌ని అంటున్నారు.

ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌క‌పోయినా స్థానిక రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి 6 కోట్ల రూపాయ‌లు ఇస్తున్నార‌ని, దీనికి ప్ర‌భుత్వంలో మ‌రో 2 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించింద‌ని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్లాన్‌ను మార్చిలోనే ప్ర‌జ‌ల‌కు వివ‌రించి, ర‌హ‌దారి ప‌నుల‌కు మార్కింగ్ కూడా వేశార‌ని, ఇక‌, ఇప్పుడు కూల్చే సిన ఇళ్లు కానీ, ప్రాంతాలు కానీ ఆక్ర‌మిత‌మేన‌ని, అవి ప‌ట్టా ఉన్న భూములు కావ‌ని ఇక్క‌డి వారు కొంద‌రు చెబుతున్నారు.

ఇక‌, జ‌న‌సేన మాత్రం ఇది రాజ‌కీయ క‌క్ష‌లో భాగంగానే చేస్తున్న ప‌నిగా చెబుతోంది. తాము పెట్టుకున్న జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు ఇక్క‌డి రైతులు భూములు ఇచ్చార‌నే కార‌ణంగా ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగింద‌ని అంటున్నారు.

దీంతో ఇక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంద‌ని అంటున్నారు. వ్య‌తిరేకించేవారు ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే ఉన్నార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న దానిలో వాస్త‌వం లేద‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. ఏదేమైనా ఇప్ప‌టం గ్రామంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆస‌క్తిగా మారాయి. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News