ఏపీని గెల‌వ‌డం.. కేసీఆర్ కు ఈజీయేనా?

Update: 2022-06-19 01:30 GMT
రాజ‌కీయంగా ర‌చ్చ‌(జాతీయ‌) గెల‌వాల‌ని భావిస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇంట గెల‌వ‌గ‌ల‌రా?  రెండో తెలుగు రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌గ‌ల‌రా?  ఇదీ.. ఇప్పుడు రెం డు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసీఆర్‌.. అడుగులు వేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే.. జాతీయ రాజ‌కీయాల్లో స‌త్తా చాటాలంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 పార్ల‌మెంటు స్థానాల్లో క‌నీసం.. ఆయ‌న 30 చోట్ల విన్ అయితే.. జాతీయ స్థాయిలో భారీ ఎత్తున చ‌క్రం తిప్పేందుకు అవ‌కాశం ఉంటుంది.

మ‌రి ఇది చేయాలంటే.. ఏపీలో ఉన్న 25 సీట్ల‌లో క‌నీసం.. 17-20 స్థానాల్లో స‌త్తా చాటాలి. ఇలా చేయాలంటే.. కూడా ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆయ‌న త‌న‌వైపు తిప్పుకోగ‌ల‌గాలి. ఇది అత్యంత ముఖ్యం. ఇప్పుడున్న అనేక స‌మ‌స్య‌ల‌కు కేసీఆర్ ప‌రిష్కారం చూపించ‌గ‌ల‌గాలి.  ముఖ్యంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు తీర‌ని క‌ల‌గా ఉన్న ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేసీఆర్ ఏం చేస్తారో.. చెప్పాల్సి ఉంటుంది. హోదాకు త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని.. గ‌తంలో కేసీఆర్ కుమార్తె.. క‌విత పార్ల‌మెంటులోనే చెప్పారు.

అయితే.. ఏమైందో ఏమో.. ఆ మ‌రుస‌టి రోజు.. త‌మ‌కు కూడా న్యాయం చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. త‌మ రాష్ట్రానికి కూడా హోదాతో స‌మాన‌మైన నిధులు ఇవ్వాల‌న్నారు.

అంటే.. ఇది ఏపీ విష‌యంలో ద్వంద్వ వైఖ‌రిని అవ‌లంబిస్తున్న‌ట్టేన‌ని అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, పోల‌వ‌రం విష‌యంలో తెలంగాణ స‌ర్కారు సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఇది ఇప్ప‌టికీ పెండింగులో ఉంది. మ‌రి ఏపీలోచ‌క్రం తిప్పాల‌ని కేసీఆర్ భావిస్తే.. పోల‌వ‌రం విష‌యంపైనా స్ప‌ష్టత ఇవ్వాలి.

మ‌రీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఆది నుంచి కూడా కేసీఆర్ వ్య‌తిరేకిస్తున్నారు. కృష్ణా జ‌లాల్లో వాటా పెంచాల‌ని.. కోరుతున్నారు.

ఇలా.. అనేక వివాదాలు.. ఇప్ప‌టికీ.. ప‌రిష్కారం కాకుండా అలానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో ఏపీప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తారు?  అవి ఆయ‌నకు ఎలాంటి మేళ్లు చేస్తాయి? అనేది చూడాలి. ఏదేమైనా..ఏపీని మెప్పించ‌కుండా.. కేసీఆర్ ఎన్ని అడుగులు వేసినా.. లోటుగానే ఉంటుద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News