జ‌గ‌న్ ప్ర‌భుత్వం లెక్క‌ల్లోనూ త‌ప్పులు చేస్తోందా?

Update: 2022-08-04 05:49 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల‌పై ఇంటాబ‌య‌ట తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల‌ను కంట్రోల్ చేయ‌క‌పోతే రాష్ట్రం మ‌రో శ్రీలంక‌లా మారుతుంద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు, ఆర్థిక నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అవ‌కాశమున్న‌కాడికి అందిన‌చోటల్లా అప్పులు తెస్తోంద‌ని మీడియా పేర్కొంటోంది.

మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం, కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్) త‌దిత‌ర సంస్థ‌లు ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న రుణాల‌కు సంబంధించి లెక్క‌లు అడిగితే జ‌గ‌న్ స‌ర్కార్ త‌ప్పుడు లెక్క‌లు ఇస్తోంద‌ని ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొన్ని అప్పులను దాచిపెట్టి.. వాటిని ర‌క‌ర‌కాలుగా క‌నిక‌ట్టు చేసి.. ఒక ఖాతాల నుంచి ఇంకో ఖాతాల్లోకి మార్చి.. ఇలా కొన్నింటిని కేంద్రానికి చెప్ప‌కుండా దాస్తోంద‌ని అంటున్నారు.
 
ఆర్థిక బాధ్య‌త‌, బ‌డ్జెట్ నిర్వ‌హ‌ణ చ‌ట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలోకి రాకుండా ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రుణాలు తీసుకుని, అవి ప్రభుత్వ అప్పులు కావని జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాదిస్తోంద‌ని చెబుతున్నారు. అయితే జ‌గ‌న్ ప్రభుత్వ వాద‌న‌ల్లో పసలేదని కేంద్రం తేల్చేసిందంటున్నారు. దొడ్డిదోవన తీసుకుంటున్నవీ ప్రభుత్వ అప్పులేనని కేంద్రం తేల్చి చెప్పింద‌ని అంటున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు ఇచ్చేందుకు షెడ్యూల్డ్ బ్యాంకులన్నీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయనీ రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింద‌ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

జ‌గ‌న్ స‌ర్కార్ బడ్జెట్‌ పుస్తకాల్లో చూపిస్తున్న లెక్కలకు, కేంద్రానికి అందించిన‌ లెక్కలకు పొంతనే కుద‌ర‌డం లేదంటున్నారు. రాష్ట్రం కేంద్రానికి నివేదించిన లెక్కల్లో తేడాలున్నాయని అంటున్నారు. చట్టసవరణ చేసి మరీ డిబెంచర్లు వేలం వేసి తెచ్చుకున్న రుణాలను ఆ లెక్కల్లో చేర్చలేద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇస్తూ తీసుకుంటున్న రుణాల‌ను కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి రాజ్యసభలో తాజాగా వెల్లడించారు. ఇవి కేంద్ర ప్ర‌భుత్వం పరిశీలించి చెబుతున్న లెక్క‌లు కాద‌ని.. ఏపీ ప్ర‌భుత్వం కేంద్రానికి అందించిన లెక్క‌ల‌ని తెలిపారు. ఆ లెక్కల ప్ర‌కారం.. ఆంధ్రప్రదేశ్‌ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.22,549.50 కోట్లు, 2021-22లో రూ.6,287.74 కోట్లు ఇలా రుణాలు తీసుకున్నట్లు వెల్ల‌డించారు. అలాగే 2022-23లో రూ.500 కోట్లు ఇలా తీసుకోవాలన్న అంచనాలున్నాయని జ‌గ‌న్ స‌ర్కార్ తెలిపినట్లు పేర్కొంది.
Tags:    

Similar News