బీకామ్‌ లో ఫిజిక్స్ కూడా జంపేనా..?

Update: 2019-11-24 01:30 GMT
ఓ వైపు భారీ ఓటమి... మరోవైపు నేతల జంపింగులతో 37 ఏళ్ల చరిత్రగల తెలుగుదేశం పార్టీ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. అయితే ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అధినేత చంద్రబాబు ఎంత కష్టపడుతున్నా ఆ పార్టీ నేతలు ఏ మాత్రం సహకరించడం లేదు. దీనికి తోడు పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టేస్తూ ఇంకొందరు నేతలు దుకాణం సర్దేసి వైసీపీ వైపు వెళ్ళేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కంచుకోట లాంటి కృష్ణా జిల్లా లో మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.

ఇప్పటికే దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ లాంటి బడా నేతలు టీడీపీకి ఝలక్ ఇచ్చి వైసీపీలోకి వెళ్లారు. ఇక తాజాగా విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే, బీకామ్ లో ఫిజిక్స్ ఉందని చెప్పి బాగా ఫేమస్ అయిన జలీల్ ఖాన్ కూడా వైసీపీలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. 2014లో వైసీపీ తరుపున గెలిచిన జలీల్...ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. మంత్రి ప‌ద‌వి తో పాటు ఎన్నెన్నో ఆశ‌లే పెట్టుకుని ఆయ‌న ప‌సుపు కండువా వేసుకున్నారు.

అయితే బాబు ఆయ‌న ఆశ‌ల‌ పై నీళ్లు చ‌ల్లారు. ఇక 2019 ఎన్నికల్లో జలీల్ పోటీ నుంచి తప్పుకుని ఆయన కుమార్తె షబనా ఖాతూన్ కు టికెట్ ఇప్పించుకున్నారు. కానీ ఆమె అనూహ్యంగా ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఎన్నిక‌ల‌కు ముందే అమెరికా నుంచి వ‌చ్చిన ఆమె ఓడిన వెంట‌నే మ‌ళ్లీ అమెరికా చెక్కేశారు. అయితే దీనికి కారణం సొంత పార్టీ నేతలే అని జలీల్ అసంతృప్తితో ఉన్నారు. జలీల్ అనారోగ్య కారణాల వల్ల పార్టీ లో యాక్టివ్ గా ఉండటం లేదు. మరోవైపు వెస్ట్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దూసుకు పోతున్నారు.

అటు సొంత పార్టీ లోనే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు సహకరించడం లేదు. అలాగే ఎంపీ కేశినేని నాని వెస్ట్ లో కీలకంగా ఉన్న వన్ టౌన్‌లో పట్టు పెంచుకోవడానికి చూస్తున్నారు. వ‌చ్చే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ త‌న వ‌ర్గం వాళ్ల‌కు కార్పొరేట‌ర్ సీట్లు ఇప్పించుకునే ప్ర‌య‌త్నాల్లో నాని ఉన్నారు. అటు బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గాల‌ను ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌లీల్ పార్టీ లో ఉన్నా డ‌మ్మీ అయిపోయారు.

టీడీపీ లో తనకు ప్రాధాన్యత తగ్గి పోయిందని భావించిన జలీల్ మళ్ళీ సొంత గూటికి వెళ్ళేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతూ జగన్ కు దగ్గరయ్యేందుకు చూస్తున్నట్లు సమాచారం. కాక పోతే జలీల్ ఇప్పటికిప్పుడు వైసీపీ లోకి వెళ్ళిన పెద్ద ప్రాధాన్యత దక్కదు. కానీ తన వర్గాన్ని నిలుపుకోవాలంటే వైసీపీ లోకి వెళ్లడమే బెటర్ అని భావిస్తున్నారు. మొత్తానికి బీకామ్ లో ఫిజిక్స్ కూడా త్వరలోనే జంప్ అయిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News